అక్కినేని నాగార్జున నటిస్తున్న చిత్రం ‘కింగ్100’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున కెరీర్లో ఇది 100వ సినిమా కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. మరోవైపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు మరోసారి వెండితెరపై కలిసి కనిపించనుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. 1998లో వచ్చిన ‘ఆవిడా మా ఆవిడే’ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. తాజాగా టబు పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను నాగార్జున విడుదల చేశారు.
ఈ చిత్రంలో టబు ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే శక్తివంతమైన రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ టీజర్లో ఆమె భారీ జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. చేతిని పైకెత్తి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నట్లు చూపించారు.
ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు కష్టాన్ని నమ్మేవారు.. మరొకరు అదృష్టాన్ని నమ్మేవారు. నాకు అదృష్టం అంటే అసహ్యం అంటూ టబు చెప్పిన డైలాగ్ ఆసక్తి రేపుతోంది. టీజర్ చివర్లో ఈసారి ప్రేమ కాదు.. యుద్ధం అనే వాక్యం కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
టబు పుట్టినరోజు సందర్భంగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. ప్రియమైన టబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిన్నే పెళ్లాడతా సినిమాలోని పండు పాత్రను ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణిగా కూడా నువ్వు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోతావు. ఈ సినిమాను నువ్వు ఎంతో ప్రత్యేకంగా మార్చావు. నీ పుట్టినరోజును, నీలోని కొత్త ఆవేశాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ చిన్న గ్లింప్స్‌ను పంచుకుంటున్నాను. ఈసారి ప్రేమ కాదు అని నాగార్జున పేర్కొన్నారు.
నాగార్జున, టబు గతంలో 1996లో విడుదలైన నిన్నే పెళ్లాడతా చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 1998లో ఆవిడా మా ఆవిడేలో జంటగా కనిపించారు. ఇప్పుడు దాదాపు 28 ఏళ్ల విరామం తర్వాత కింగ్100 కోసం మళ్లీ ఒక్కటవుతున్నారు. ‘కింగ్100’ డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

