HomeNATIONALSupreme Court:రామ్‌లీలా మైదాన్ నిరసనలపై సుప్రీం..నిరసనల పేరుతో ఆక్రమణలా అంటూ ప్రశ్న?

Supreme Court:రామ్‌లీలా మైదాన్ నిరసనలపై సుప్రీం..నిరసనల పేరుతో ఆక్రమణలా అంటూ ప్రశ్న?

📰 Generate e-Paper Clip

నిరసనల పేరుతో ఒక ప్రదేశాన్ని నిరవధికంగా ఆక్రమించుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని అయితే అందుకు నిర్దిష్ట సమయం, గడువు ఉండాలని స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్, రామ్‌లీలా మైదాన్‌లో ఇటీవల నిర్వహించిన ఆందోళనలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

పండుగల సమయంలో సీఈసీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసనలను నిలిపివేయాలని కోరుతూ వ్యాపార సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సహా ఇతర ప్రతివాదులకు సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం పలు పిటిషన్లను విచారించింది. వీటిలో కిరాణా కమిటీ ఢిల్లీ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఉంది. రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన నిరసనల కారణంగా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆ సంఘం తన పిటిషన్‌లో పేర్కొంది.

ఈ సందర్భంగా సీజేఐ స్పందిస్తూ.. ఒక ప్రదేశాన్ని ఎప్పటికీ ఆక్రమించుకుని ఉండలేరు. అలా అయితే రైతులు, జర్నలిస్టులు తదితరులు ఎక్కడికి వెళ్లాలి? ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంది. అయితే అందుకు నిర్దిష్ట సమయం, కాలపరిమితి కేటాయించాలి అని వ్యాఖ్యానించారు. వ్యాపార సంఘాల పిటిషన్‌తో పాటు నిరసనల సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలను నిర్బంధించారన్న ఆరోపణలు, పోలీసుల దౌర్జన్యాలు, మెట్రో స్టేషన్ల మూసివేత, ఇంటర్నెట్ నిలిపివేత వంటి అంశాలపైనా ధర్మాసనం విచారణ జరిపింది.

మరోవైపు నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి నిర్వహించిన ఓట్ బచావో.. దేశ్ బచావో మహా ర్యాలీ తీవ్ర ట్రాఫిక్ అంతరాయాలకు కారణమైందని వ్యాపార సంఘాలు ఆరోపించాయి. దీపావళికి ముందు కీలకమైన షాపింగ్ సమయంలో ఢిల్లీలోని ప్రధాన మార్కెట్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయని తెలిపాయి.

చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) అంచనా ప్రకారం.. 25 ప్రధాన హోల్‌సేల్, రిటైల్ మార్కెట్ల పరిధిలోని మూడు లక్షల దుకాణాల్లో సుమారు 2.5 లక్షల దుకాణాలు మూతపడ్డాయి.ఈ ర్యాలీ కారణంగా మొత్తం రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు వ్యాపార నష్టం వాటిల్లి ఉంటుందని సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ సహా పలు వ్యాపార సంఘాల ప్రతినిధులు అంచనా వేశారు.

RELATED ARTICLES

Most Popular