ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో పాకిస్థాన్‌కు భారత్, ఇజ్రాయెల్ గట్టి షాక్ ఇచ్చాయి. ప్రాంతీయ, ఉప ప్రాంతీయ స్థాయిల్లో సాంప్రదాయ ఆయుధాల నియంత్రణకు సంబంధించి పాకిస్థాన్, బెలారస్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఆయా దేశాల భద్రతా ఆందోళనలను కేవలం ప్రాంతీయ సరిహద్దులకే పరిమితం చేయలేమని భారత్ స్పష్టం చేసింది.
ప్రాంతీయ, ఉప ప్రాంతీయ స్థాయిల్లో సంప్రదాయ ఆయుధాల నియంత్రణ పేరుతో ఈ తీర్మానాన్ని ఐరాస జనరల్ అసెంబ్లీ మొదటి కమిటీ ముందు ప్రవేశపెట్టారు. ఓటింగ్‌లో 180 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా భారత్, ఇజ్రాయెల్ మాత్రమే వ్యతిరేకించాయి. 193 సభ్య దేశాలున్న ఐరాసలో ఈ తీర్మానానికి వ్యతిరేకంగా రెండు ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఎవరూ ఓటింగ్‌కు దూరంగా ఉండలేదు.
భారత్ తరఫున ఐరాసలోని శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అన్మోల్ షేర్ బేడీ ఓటింగ్‌పై దేశ వైఖరిని వివరించారు. సంప్రదాయ ఆయుధాల నియంత్రణ అనేది ప్రపంచవ్యాప్త అంశమని, దాన్ని ప్రధానంగా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ స్థాయిల్లోనే పరిష్కరించాలన్న ప్రతిపాదనతో భారత్ పూర్తిగా ఏకీభవించడం లేదని తెలిపారు. గతంలో అనుసరించిన వైఖరికి అనుగుణంగానే భారత్ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిందని చెప్పారు.
ప్రాంతీయ సంప్రదాయ ఆయుధాల నియంత్రణ ఒప్పందాలకు మార్గదర్శక సూత్రాలను రూపొందించాలని ఐరాస నిరాయుధీకరణ కమిషన్‌ను కోరిన ప్రతిపాదనపైనా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై గతంలోనే సదరు కమిషన్ ఏకాభిప్రాయంతో పలు మార్గదర్శకాలు, సిఫార్సులను ఆమోదించిందని బేడీ గుర్తుచేశారు.
1993లో ప్రాంతీయ నిరాయుధీకరణకు సంబంధించి మార్గదర్శకాలు, సిఫార్సులు…1999లో సంప్రదాయ ఆయుధాల నియంత్రణ, నిరాయుధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు…2017లో సంప్రదాయ ఆయుధాల రంగంలో ఆచరణాత్మక విశ్వాస నిర్మాణ చర్యలపై సిఫార్సులు ఆమోదించినట్లు వివరించారు. ఇప్పటికే మూడుసార్లు చర్చించి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకున్న అంశంపై మళ్లీ మొదటి నుంచి చర్చించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
ఒక ప్రాంతం లేదా ఉప ప్రాంతంలో రక్షణ సామర్థ్యాల మధ్య సమతుల్యతను కొనసాగించాలన్న తీర్మానంలోని ప్రతిపాదనను కూడా భారత్ తప్పుబట్టింది. దేశాల భద్రతా ఆందోళనలు ప్రాంతీయ సరిహద్దుల వద్దే ఆగిపోతాయని భావించడం సరికాదని బేడీ పేర్కొన్నారు. ఆయా దేశాల భద్రతా సమస్యలు నిర్దిష్ట ప్రాంతాలు, ఉప ప్రాంతాల పరిధిని దాటి ఉంటాయని స్పష్టం చేశారు. ప్రాంతీయ స్థాయిలో సైనిక సామర్థ్యాల సమతుల్యతను కాపాడాలన్న భావన ఆచరణలో సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.
ప్రచ్ఛన్న యుద్ధం అనంతర కాలంలో శాంతి, భద్రతకు ఎదురవుతున్న ముప్పుల్లో ఎక్కువ భాగం ఒకే ప్రాంతంలోని దేశాల మధ్యే ఉత్పన్నమవుతున్నాయని ఈ తీర్మానం పేర్కొంది. అందువల్ల ప్రాంతీయ, ఉప ప్రాంతీయ స్థాయిల్లో ఆయుధ నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించింది. అలాగే ఆయుధాలు, సైనిక బలగాలను సాధ్యమైనంత తక్కువ స్థాయిలో ఉంచుతూ ప్రాంతీయ శాంతి, భద్రతను బలోపేతం చేసే ఒప్పందాలను ప్రోత్సహించాలని సూచించింది.

