బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుఫాను తీవ్ర తుపానుగా బలపడింది. మురసు తుఫాన్ నవంబర్ 3న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తీరాన్ని దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
తుఫాను ప్రభావంతో దక్షిణ, మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ఒంగోలు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో స్పష్టంగా తుఫాను ప్రభావం కనిపించగా కొత్తపట్నం బీచ్ వద్ద తీవ్రంగా అలలు ఉగ్రరూపం దాల్చాయి.
కృష్ణపట్నం పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా తుపాను నేపథ్యంలో నెల్లూరు,పల్నాడు..ఒంగోలు, ఎన్టీఆర్,కృష్ణా జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కాకినాడలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండగా నగరంలోని పలు వీధులు జలమయం అయ్యాయి.
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జువ్వలదిన్నె సమీప సముద్రంలో చేపల వేటకు వెళ్లి బోటు ఇంజన్ చెడిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులు సమన్వయంతో అప్రమత్తంగా వ్యవహరించి అలల ఉధృతిని ఎదుర్కొంటూ మత్స్యకారులను ప్రాణాలతో కాపాడారు.
తుఫాను ముప్పు నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. సహాయక, పునరావాస చర్యలకు అవసరమైన సిబ్బంది, యంత్రాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు ముందుగానే అవసరమైన సామగ్రిని తరలించాలని సూచించారు. తుపాను పరిస్థితులపై సమీక్షించేందుకు ఆయన తన ఢిల్లీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.
Also Read:BJP:భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు..
అలాగే మురాసు తుఫాను ప్రభావంతో ఒడిశాలోని గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 300కు పైగా ఎన్డీఆర్ఎఫ్, ఓడీఆర్ఏఎఫ్, అగ్నిమాపక బృందాలను సిద్ధంగా ఉంచారు.
తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సోమవారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తెలంగాణలోనూ ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.

