అనంతపురం జిల్లా రాప్తాడులో హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. పిల్‌ను రేపు విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది.
కాల్పుల ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్, సీసీటీవీ రికార్డులు, వైద్య నివేదికలను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఘటనకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పరిశీలించాలని కోరారు. బాధితుడు హేమంత్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయించాలని పిటిషన్లో పేర్కొన్నారు.
హేమంత్ వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేసి, దానిని సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించేలా ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ, జిల్లా కలెక్టర్‌తో పాటు మొత్తం తొమ్మిది మందిని ప్రతివాదులుగా చేర్చారు.
ఇదిలా ఉండగా రాప్తాడు హైస్కూల్లో జరిగిన దాడిలో గాయపడిన బాలికను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన బాలికకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు జగన్.
రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన తర్వాత పరారీలో ఉన్న నిందితుడు హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై కత్తితో దాడికి యత్నించడంతో కాల్పులు జరపగా హేమంత్ తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం హాస్పటిల్ లో చికిత్స పొందుతున్నాడు.

