తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వరుసగా పదేళ్ల పాటు (2014–2023) సాగిన బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) పాలన తీరుతెన్నులపై రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికీ వాడీవేడి చర్చ కొనసాగుతోంది. ఒకవైపు తమ పాలన తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన స్వర్ణయుగమని గులాబీ దళం వాదిస్తుంటే మరోవైపు ఆ పదేళ్ల కాలంలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి, అప్రజాస్వామిక పోకడలకు గురైందని అధికార కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన పదేళ్ల పాలన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దశాబ్దాలుగా వేధించిన కరెంటు కష్టాలకు చెక్ పెడుతూ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ మరియు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరాయని ఆ పార్టీ నేతలే కాదు గణంకాలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాయి.
రైతు బంధుతో పెట్టుబడి సాయం, రైతు బీమా థకాలు అన్నదాతలకు కొండంత అండగా నిలిచాయి. కోవిడ్ వంటి క్లిష్ట సమయంలోనూ ఆదాయం లేకపోయినా రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు, ధాన్యం కొనుగోళ్లను ఆపకుండా కొనసాగించారని సామాన్యులు సైతం చెప్పే పరిస్థితి నెలకొంది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించడంతో పాటు, హైదరాబాద్ కేంద్రంగా ఐటీ, ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచారు కేసీఆర్.
అయితే అదే సమయంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందనే విమర్శలు ఉన్నాయి. భారీ ప్రాజెక్టుల పేరుతో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ..పదేళ్లలో రాష్ట్రంపై అప్పుల భారం రూ. 7 లక్షల కోట్లకు చేరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాగే దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, నిరుద్యోగ యువతకు భృతి, పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ వంటి ప్రధాన ఎన్నికల హామీలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు ఉన్నాయి.
ముఖ్యంగా పాలన కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమైందని, ధర్నా చౌక్ వద్ద నిరసనలపై ఆంక్షలు విధించడం, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం,ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చాయి.
ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనలో సానుకూలమైన అంశాలను పరిశీలిస్తే..వ్యవసాయం,24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, ధాన్యం కొనుగోళ్లు,ఆసరా పెన్షన్లు, కాళేశ్వరం ప్రాజెక్టు,సంక్షేమ పథకాలు,కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ.
ప్రతికూల అంశాలను పరిశీలిస్తే కౌలు రైతులకు సాయం అందకపోవడం, ప్రాజెక్టుల వ్యయం భారీగా పెరగడం,నిరుద్యోగ భృతి అమలు కాకపోవడం, ఉద్యోగ నియామకాల్లో జాప్యం,లక్షల కోట్ల అప్పులు, ప్రజాస్వామ్య నిరసనలపై ఆంక్షలు.
మొత్తానికి మౌలిక వసతుల కల్పన, రైతు సంక్షేమంలో చెరగని ముద్ర వేసినప్పటికీ ఆర్థిక నిర్వహణ, ఉద్యోగ కల్పన, క్షేత్రస్థాయిలో కేసీఆర్ తీరుపై తలెత్తిన వ్యతిరేకత వెరసీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రస్తుతం పదేళ్ల బీఆర్ఎస్ పాలన వర్సెస్ కాంగ్రెస్ పాలనపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసురుతుండటంతో ఈ అంశం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కేంద్రబిందువుగా మారింది.


