()మహిళల స్వేచ్ఛకు రాజ్యాంగమే అసలైన రక్షణ..
()పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళలు రాణించాలి
()తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమ సేన’గా నామకరణం
() మహిళలకు ఆర్థికంగా, హార్దికంగా అండగా ఉంటా: కల్వకుంట్ల కవిత
స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: మహిళలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, గౌరవప్రదమైన జీవనం కల్పించిన గొప్ప ఆయుధం భారత రాజ్యాంగమేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు, తమ చరిత్రను తామే రాసుకునే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు మహిళలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ తమ సత్తా చాటాలని ఆకాంక్షించారు. మహిళలకు అవకాశాలు కల్పించడంతో పాటు, వారు రాజకీయంగా ఎదిగేందుకు తాను ఆర్థికంగా, హార్దికంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘మహిళలు–రాజ్యాంగం’ అంశంపై నిర్వహించిన సదస్సులో కవిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నవంబర్ 26ను మహిళలు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన రోజుగా అభివర్ణించారు. వేల ఏళ్లుగా మహిళలను ఒక వస్తువుగా, ఆస్తిగా చూసిన సమాజంలో వారికి సమాన హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఓటు హక్కు కల్పించిన ఘనత రాజ్యాంగానిదేనని పేర్కొన్నారు. ప్రతి మహిళ తన ఇంట్లో మత గ్రంథాలతో పాటు భారత రాజ్యాంగాన్ని కూడా ఉంచుకోవాలని సూచించారు.
రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమలు ఆశించిన స్థాయిలో లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు సైతం తమ సంపాదనపై పూర్తి స్వేచ్ఛ లేకపోవడం, ఆస్తుల విషయంలో సమాన అవకాశాలు దక్కకపోవడం, పురుషులతో సమానంగా పనిచేసినా సమాన వేతనం అందకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. కులం, మతం, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మహిళలు పురుషుల కంటే గొప్పవారమని చెప్పడం లేదని, వారితో సమానంగా గౌరవం, అవకాశాలు, హక్కులు మాత్రమే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేస్తే మహిళల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
మహిళలపై ఆధిపత్యం చెలాయించేందుకు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత అన్నారు. మహిళలకు తెలివితేటలు లేవనే భావన కల్పిస్తూ వారిని ఆత్మన్యూనతకు గురిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సహా అనేక ఉద్యమాల్లో మహిళలు పురుషులతో సమానంగా పోరాడినా చరిత్రలో వారికి తగిన గుర్తింపు దక్కలేదన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటంపై వెలువడిన 21 పుస్తకాల్లో 20 పుస్తకాలను పురుషులే రచించారని, మహిళల పోరాటాలకు తగిన ప్రాధాన్యత లభించలేదని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ పోరాటం గురించి ఒక మహిళ రాసిన పుస్తకం ద్వారా విస్తృతంగా తెలిసిందని గుర్తుచేశారు. అందుకే మహిళలు తమ చరిత్రను తామే రాసుకోవాలని, తమ పోరాటాలను తామే ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు.
సమాజంలో మార్పు కోసం ముందుకు వచ్చే మహిళలను అవమానించే ధోరణి ఇప్పటికీ కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు విద్య అందించేందుకు కృషి చేసిన సావిత్రిబాయి పూలేపై ఆనాడు పేడ, మురికి నీళ్లు చల్లారని, నేడు రాజకీయాల్లోకి వస్తున్న మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. సావిత్రిబాయి పూలేకు సహకరించిన ఫాతిమా షేక్ సైతం అవమానాలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఇలాంటి విమర్శలకు భయపడకుండా మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. మహిళల భద్రత, స్వేచ్ఛ విషయంలో సమాజం మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. యువతులపై దాడులు, విద్యార్థినుల భద్రతకు సంబంధించిన ఘటనలను ప్రస్తావిస్తూ మహిళల సమస్యలను రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాలని కోరారు.
మహిళలకు కేవలం పెన్షన్లు, బంగారం, సైకిళ్లు అందిస్తామని హామీలు ఇవ్వడం కాకుండా, వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, బ్యాంకు ఖాతాలు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కవిత స్పష్టం చేశారు. మహిళలు తమ మనస్సాక్షికి అనుగుణంగా, ఎవరికీ భయపడకుండా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మహిళలు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు తాను ఆర్థికంగా, హార్దికంగా అండగా ఉంటానని ప్రకటించారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే పార్టీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. చీరలు కట్టుకున్న మహిళలు కేవలం కచేరీలకే పరిమితం కాకుండా చట్టసభల్లోకి వెళ్లి ప్రజా సమస్యలపై గళమెత్తాలని ఆకాంక్షించారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమ సేన’గా పేరు మారుస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా మహిళా నాయకులతో కలిసి నూతన విభాగం పోస్టర్ను ఆవిష్కరించారు. రుద్రమదేవి స్ఫూర్తితో అవసరమైతే కత్తి పట్టి పోరాడే ధైర్యాన్ని ప్రదర్శించాలని మహిళా నాయకులకు సూచించారు. ప్రతి మహిళ గల్లీగల్లీ తిరుగుతూ ఇంటింటికీ రాజ్యాంగం అందించిన హక్కులపై అవగాహన కల్పించాలని, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల మహిళా ఇన్ఛార్జీలు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్, మహాత్మా గాంధీ, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి కవిత నివాళులర్పించారు. ఈ సదస్సులో తెలంగాణ రక్షణ సేన మహిళా నాయకులు మనోజ గౌడ్, వేముల భవాని, సూరారపు కృష్ణవేణి, కావేటి సబిత, సండ్ర మాలతి, పగిడాల శ్రావణి, రజియా బేగం, హలిమా బేగం, తిరుపతి పరమేశ్వరీ, లలితా యాదవ్, సౌజన్య రెడ్డి, గీత, అంశం శివరాణి, ఝాన్సీ, అనితా చౌదరి తదితరులు పాల్గొని ప్రసంగించారు.


