స్టార్ త్రినేత్రం, వరంగల్: నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న యువతకు ప్రభుత్వం న్యాయం చేయాలని, లేనిపక్షంలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ యువత తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి.. లేదంటే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే నినాదంతో యువత ముందుకు సాగాలని అన్నారు.
లైబ్రరీలు, శిక్షణ కేంద్రాల సందర్శన కార్యక్రమంలో భాగంగా గురువారం వరంగల్ ప్రాంతీయ గ్రంథాలయాన్ని సందర్శించిన ఏనుగుల రాకేశ్ రెడ్డి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత, విద్యార్థులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు, ఉద్యోగాల సాధనలో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ నియామకాలపై ఉన్న అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రస్తుత పరిణామాలపై అవగాహన కల్పించే ప్రశ్నలు, సమాధానాలతో కూడిన కరెంట్ అఫైర్స్ పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థుల చదువుకు తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యువత సమస్యలను పట్టించుకోకపోవడం సరైన విధానం కాదన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని సూచించారు. యూత్ డిక్లరేషన్లో ప్రకటించిన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ వంటి హామీలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ కేవలం ప్రకటనలకే పరిమితం కాలేదని, వారి హక్కుల కోసం న్యాయపోరాటం సైతం చేసిందని గుర్తుచేశారు. యువతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని భరోసా ఇచ్చారు.
పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు సంబంధించి లాంగ్ జంప్ అర్హత నిబంధనలను ప్రభుత్వం పునఃసమీక్షించాలని రాకేశ్ రెడ్డి కోరారు. 3.8 మీటర్ల లాంగ్ జంప్ నిబంధన కారణంగా ఎంతోమంది అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్షల దశలోనే అవకాశాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు న్యాయం జరిగేలా భారీ సంఖ్యలో పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

గిరిజన, ఆదివాసీ యువతకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో న్యాయం జరిగేలా 75 శాతం స్థానిక రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక యువతకు తగిన అవకాశాలు దక్కాలని, వారి హక్కులు, భవిష్యత్తు కోసం బలంగా గొంతు వినిపిస్తామని తెలిపారు. గ్రూప్-1 నియామకాలు, డీఎస్సీ క్రీడా కోటా నియామకాలకు సంబంధించి వస్తున్న అవకతవకల ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. నియామక ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ అర్హులైన అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నాణ్యమైన అధ్యయన సామగ్రి అందించాలనే ఉద్దేశంతో కరెంట్ అఫైర్స్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు రాకేశ్ రెడ్డి తెలిపారు. ఒక ఉద్యోగం సాధించేందుకు విద్యార్థులు పడుతున్న కష్టం, వారి కుటుంబాలు పెట్టుకున్న ఆశలు తనకు తెలుసన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా లక్ష్య సాధన కోసం శ్రమిస్తున్న ప్రతి నిరుద్యోగ విద్యార్థి విజయం సాధించాలని ఆకాంక్షించారు. పుస్తకాల పంపిణీ చిన్న సహకారమే అయినప్పటికీ, విద్యార్థుల ఉద్యోగ సాధన ప్రయాణంలో వారికి అండగా నిలవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
తాను ఈ ప్రాంత బిడ్డనని, ఇక్కడి ప్రజల కష్టాలు, విద్యార్థుల ఆశలు, నిరుద్యోగ యువత ఆవేదన తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. గత 14 ఏళ్లుగా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై పోరాడుతున్నానని, తన రాజకీయ జీవితం ప్రజల ముందున్న తెరిచిన పుస్తకమని అన్నారు. తన ప్రయాణం, ప్రజలతో ఉన్న అనుబంధం, ఇప్పటివరకు చేసిన పోరాటాలకు ప్రజలే సాక్షులని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన రాజకీయ లక్ష్యమని స్పష్టం చేశారు.
తనకు చట్టసభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పిస్తే పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థుల గొంతుకగా నిలుస్తానని రాకేశ్ రెడ్డి హామీ ఇచ్చారు. వారి సమస్యలను చట్టసభలో బలంగా వినిపించి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగిస్తే ప్రజల గౌరవం పెరిగేలా, ఈ ప్రాంత ప్రతిష్ఠ ఇనుమడించేలా పనిచేస్తానని తెలిపారు. పదవుల కోసం ప్రజల వద్దకు రావడం కాకుండా, ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన నాయకత్వమని అన్నారు. విద్యార్థుల ఆశయాలు నెరవేరి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించినప్పుడే వారి కుటుంబాల్లో నిజమైన ఆనందం వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కొనుకటి ప్రశాంత్, పిన్నింటి విజయ్, గువ్వ రాజేష్, ఎలీషా, జన్ను విద్యా, షరీఫ్, యువజన నాయకులు పురుషోత్తం, రమేష్, రేవంత్, వంశీ రెడ్డి, వాసు, జన్ను యువరాజు, రాకేష్తో పాటు పలువురు నిరుద్యోగ యువత, విద్యార్థులు పాల్గొన్నారు.


