HomePOLITICALVijayasai Reddy: సామాజిక న్యాయమే ఎజెండా..‘పరివర్తన రాజనీతి పార్టీ’ ప్రారంభించిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy: సామాజిక న్యాయమే ఎజెండా..‘పరివర్తన రాజనీతి పార్టీ’ ప్రారంభించిన విజయసాయిరెడ్డి

📰 Generate e-Paper Clip

Vijayasai Reddy: ఏపీ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ పేరుతో తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు మాజీఎంపీ విజయసాయి రెడ్డి. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావడం, ప్రజల సంక్షేమానికి కృషి చేయడం తమ పార్టీ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరు, ప్రజాస్వామ్యం, రాజకీయాల్లో ప్రజల పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏ ఒక్క నాయకుడి వల్ల రాష్ట్రం లేదా దేశం మారిపోదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తాను ఒక్కడినే ఆంధ్రప్రదేశ్‌ను మార్చేస్తానని చెబితే అది వేదికపై చెప్పే మొదటి అబద్ధమవుతుందని వ్యాఖ్యానించారు. నిజమైన మార్పు ప్రజల నుంచే రావాలని, రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడంతోనే పౌరుల బాధ్యత ముగిసిపోదని, వాస్తవానికి అక్కడి నుంచే వారి అసలైన పాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. ప్రభుత్వాలను ప్రశ్నించడం, పాలనను పర్యవేక్షించడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం చొరవ చూపడం ప్రజల బాధ్యత అని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపైనా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ప్రభుత్వం తాను చేసిన మంచి పనుల గురించి మాత్రమే ప్రచారం చేసుకుంటోందని, తన తప్పులను తాను సమీక్షించుకునే లేదా ఆడిట్ చేసుకునే వ్యవస్థ కనిపించడం లేదని అన్నారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని సూచించారు.

పరివర్తన రాజనీతి పార్టీ సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతుల సమస్యలను పరిష్కరించడం, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం తమ పార్టీ ప్రధాన అజెండాలో ఉంటాయని వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ విధానాలు, కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.సామాజిక న్యాయమే తమ ఎజెండా అని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో మార్పు రావాలంటే ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరించాలని, పాలకులను ప్రశ్నించే హక్కును వినియోగించుకోవాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

అయితే PRP ఈ పేరు వినగానే గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్రజా రాజ్యం పార్టీ గుర్తుకు వస్తుండగా తాజాగా విజయసాయి PRPని పరివర్తన రాజనీతి పార్టీగా ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular