HomeANDRA PRADESHAP Updates:జైలు నుండే జడ్పీటీసీగా వైసీపీ నేత..ఎంపీటీసీగా జర్నలిస్ట్, వివరాలివే

AP Updates:జైలు నుండే జడ్పీటీసీగా వైసీపీ నేత..ఎంపీటీసీగా జర్నలిస్ట్, వివరాలివే

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి. పలు స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు విజయాలు సాధించగా, వైఎస్సార్‌సీపీ నామమాత్రపు విజయాలతో సరిపెట్టుకుంది. మరోవైపు కీలక రాజకీయ నేతల కుటుంబ సభ్యులు సైతం ఓటమి పాలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు అనూహ్య విజయాలు సాధించి కూటమికి షాక్ ఇచ్చారు.

జైల్లో ఉండి జడ్పీటీసీగా గెలిచిన సత్యనారాయణరెడ్డి

నెల్లూరు జిల్లా పెళ్లకూరు జడ్పీటీసీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హత్యాయత్నం కేసులో అరెస్టయి నెల్లూరు జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ అభ్యర్థి సత్యనారాయణరెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిపై ఏకంగా 1,719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేసు కారణంగా ఎన్నికల ప్రచారానికి ఆయన పూర్తిగా దూరమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులే ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. అభ్యర్థి లేకుండానే ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. చివరకు ఓటర్లు ఆయనకు పట్టం కట్టడం విశేషం.

22 ఏళ్లకే ఎంపీటీసీగా కాకి వినోదిని

ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో మరో ఆసక్తికర విజయం నమోదైంది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన 22 ఏళ్ల కాకి వినోదిని ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థిపై 1,081 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీఏలో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జర్నలిజం చదివిన వినోదిని చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి తొలి ఎన్నికల్లోనే గెలుపొందారు.

బొత్స కుమార్తెకు ఓటమి

విజయనగరం జిల్లాలోని బొండపల్లి జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పాశల నీరజ ఘన విజయం సాధించారు. వైసీపీ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె అనూషపై 5,136 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితం వైసీపీ శ్రేణులకు ఎదురుదెబ్బగా మారింది.

మంత్రి సంధ్యారాణికి సొంత నియోజకవర్గంలో షాక్

మరోవైపు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సొంత నియోజకవర్గమైన సాలూరులో వైసీపీ ఆధిపత్యం ప్రదర్శించింది. సాలూరు జడ్పీటీసీ స్థానంలో రీకౌంటింగ్ నిర్వహించినప్పటికీ వైసీపీ అభ్యర్థి 65 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాకుండా మూడు మండలాల్లో 18 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా కొనసాగినప్పటికీ సాలూరులో మాత్రం వైసీపీ తన పట్టును నిరూపించుకుంది.

RELATED ARTICLES

Most Popular