HomeTELANGANAKavitha:నల్గొండకు గోదావరి జలాలే శాశ్వత పరిష్కారం..దిండి ప్రాజెక్టు పరిశీలన

Kavitha:నల్గొండకు గోదావరి జలాలే శాశ్వత పరిష్కారం..దిండి ప్రాజెక్టు పరిశీలన

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లాను దశాబ్దాలుగా వేధిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యతో పాటు సాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపాలంటే గోదావరి జలాలను జిల్లాకు తరలించాల్సిందేనని తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కృష్ణా నదిపై ఆధారపడటం వల్ల నల్గొండకు ఆశించిన స్థాయిలో నీరు అందడం లేదని విమర్శించారు. దిండి ప్రాజెక్టును సందర్శించిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

కృష్ణా జలాలపై ఆధారపడితే ప్రయోజనం లేదు

కృష్ణా నదిలో నీటి లభ్యత గణనీయంగా తగ్గిందని కవిత పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగులకు చేరినప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి నీటిని తరలిస్తున్నారని, దీంతో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై ప్రభావం పడుతోందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ తన నీటి వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అవసరమైన వ్యవస్థలను నిర్మించుకోలేకపోయిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీశైలాన్ని నీటి వనరుగా ఎంచుకోవడమే ప్రాథమిక తప్పిదమని అభిప్రాయపడ్డారు.

ఏదుల నుంచి ఉల్పెరకు నీటి తరలింపు సాధ్యమేనా?

ఏదుల రిజర్వాయర్ నుంచి 0.6 టీఎంసీల నీటిని పైప్‌లైన్ లేదా కాలువ ద్వారా ఉల్పెరకు తరలిస్తామని ప్రభుత్వం చెబుతున్న ప్రతిపాదనపై కవిత సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పటివరకు దీనిపై అధికారిక సర్వే, జీవో, భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన వల్ల మహబూబ్‌నగర్ రైతాంగానికి నష్టం కలిగే అవకాశం ఉందని, రెండు జిల్లాల రైతుల మధ్య విభేదాలు సృష్టించకూడదని సూచించారు.

గోదావరి జలాల కోసం మూడు ప్రత్యామ్నాయ మార్గాలు

నల్గొండ జిల్లాకు గోదావరి నీటిని తరలించేందుకు మూడు ప్రతిపాదనలను ఆమె వివరించారు. మొదటిగా మల్లన్నసాగర్-బసవాపూర్ రిజర్వాయర్ నుంచి సుమారు 110 కిలోమీటర్ల మేర కాలువ లేదా పైప్‌లైన్ నిర్మించి ఉల్పెరకు నీటిని తీసుకురావచ్చన్నారు. రెండో ప్రతిపాదనలో బసవాపూర్ నుంచి శివన్నగూడెం రిజర్వాయర్‌కు సహజమైన ఎత్తు వ్యత్యాసాన్ని ఉపయోగించుకుని గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చని తెలిపారు. మూడో మార్గంగా కొండపోచమ్మసాగర్ నుంచి షామీర్‌పేట చెరువు మీదుగా శివన్నగూడెంకు అనుసంధానం చేయాలని సూచించారు.

పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి

80 శాతానికి పైగా పనులు పూర్తయిన బసవాపూర్ రిజర్వాయర్‌ను మిగిలిన నిధులతో పూర్తి చేయకుండా పక్కనే గంధమల్ల ప్రాజెక్టుకు కొత్తగా శంకుస్థాపనలు చేయడం సరికాదని విమర్శించారు. అలాగే ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అదనంగా 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు.

ఫ్లోరోసిస్ నివారణకు ఉపరితల జలాలే మార్గం

మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ సమస్య మళ్లీ వెలుగులోకి రావడం ఆందోళనకరమని కవిత అన్నారు. రాబోయే 30 నుంచి 40 ఏళ్లపాటు నదీ జలాలు నిరంతరం ఉపరితలంపై ప్రవహించేలా చర్యలు తీసుకుంటేనే భూగర్భంలో ఫ్లోరైడ్ తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా చిన్న రిజర్వాయర్లను నిర్మించి నీటిని నిల్వ చేయాలని సూచించారు.

తుపాకులగూడెం వద్దే గోదావరి-కావేరి అనుసంధానం

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-కావేరి నదుల అనుసంధానాన్ని పోలవరం వద్ద కాకుండా తెలంగాణలోని తుపాకులగూడెం (సమ్మక్క బ్యారేజ్) వద్ద చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. అప్పుడే తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడుకుంటూ కరువు ప్రాంతాలకు నీటిని మళ్లించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఇక కరువు మండలాల్లో పంటలు వేయవద్దని సూచిస్తున్న ప్రభుత్వం.. నష్టపోతున్న రైతులకు ఎకరానికి కనీసం రూ.25 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని, దేవరకొండ, నల్గొండ ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న రహదారులను మరమ్మతు చేయాలని కోరారు. నల్గొండకు శాశ్వతంగా సాగునీరు, తాగునీటి సమస్యల నుంచి విముక్తి కల్పించాలంటే గోదావరి జలాల తరలింపుపై ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కవిత స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular