మధ్యవర్తిగా రికార్డ్ అసిస్టెంట్!.. ఎమ్మార్వో డీల్?
Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మండల రెవెన్యూ కార్యాలయంలో పట్టాల మంజూరు పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రైతులకు పారదర్శకంగా సేవలు అందించాల్సిన చోట కొంతమంది అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పట్టా సంబంధిత పనులు పూర్తి చేయించాలంటే తప్పనిసరిగా డబ్బు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని పలువురు బాధిత రైతులు వాపోతున్నారు. రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకుండా, ప్రక్రియ పేరుతో వారిని కార్యాలయం చుట్టూ తిప్పించి చివరికి లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ రికార్డ్ అసిస్టెంట్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడని, అతని ద్వారా మొత్తం వ్యవహారం నడుస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు.
పట్టా మంజూరు కోసం ఎకరానికి రూ.10 వేల చొప్పున డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. డబ్బు చెల్లించిన వారి దరఖాస్తులు వేగంగా ముందుకు సాగుతుండగా, చెల్లించని వారి ఫైళ్లు పెండింగ్‌లో ఉంచుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎమ్మార్వో కార్యాలయానికి చెందిన అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డ్ అసిస్టెంట్ ద్వారా డబ్బు వసూలు చేసి పైస్థాయికి చేరవేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చకు దారితీశాయి. ఇదే సమయంలో ఎమ్మార్వో అధికారిక వాహనం నడిపే డ్రైవర్‌కు కూడా లంచాల ద్వారానే జీతం అందుతున్నట్లు ప్రచారం జరుగుతుండడం వివాదానికి మరింత ఊతమిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలు, బాధితుల వాంగ్మూలాలు, ఆధారాలతో కూడిన ప్రత్యేక కథనాన్ని త్వరలో ‘స్టార్ త్రినేత్రం’ పాఠకుల ముందుకు తీసుకురానుంది.
ALSO READ: Ghost Train: ట్రైన్ మొత్తం దెయ్యాలే.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్
Last Updated on August 2, 2026 · 7:17 AM by Star Trinethram



