Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Congress Government: తెలంగాణ కాంగ్రెస్‌లో సూపర్ పవర్ రేవంత్ రెడ్డి

Author
Posted By STAR TRINETHRAM
| 06 Mar 2026, 04:55 PM | Politics
Congress Government: తెలంగాణ కాంగ్రెస్‌లో సూపర్ పవర్ రేవంత్ రెడ్డి

ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై దృష్టి

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊరట

రైతులకు రుణమాఫీతో ఉపశమనం

ఆరోగ్యశ్రీ విస్తరణతో పేదలకు వైద్య భరోసా

విజన్ 2047తో తెలంగాణ భవిష్యత్ లక్ష్యాలు

Congress government: తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు అజేయ శక్తిగా కనిపించిన బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో పెద్ద మలుపుగా నిలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్నదనే భావన బలంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం చాలా మందిలో లేకపోయినా, ఆ పార్టీ నాయకులు మాత్రం వెనక్కి తగ్గలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లి బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూనే తమ పాలన ఎలా ఉండబోతుందో వివరించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను వివరించి ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు. ఈ హామీలపై ప్రజల్లో విశ్వాసం పెరగడంతో కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించింది. బీఆర్‌ఎస్‌ను ఓడించడం అసాధ్యమని భావించిన రాజకీయ విశ్లేషకులకే ఈ ఫలితం ఆశ్చర్యాన్ని కలిగించింది. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశను చూపిస్తున్నారు. మార్పు కోరుకున్న ప్రజల ఆశలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ తన పాలనను కొనసాగిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న ఈ సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలు దిశగా ప్రభుత్వం వరుస చర్యలు చేపడుతోంది. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోంది. ప్రజా పాలన అనే నినాదంతో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావడానికి ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలను సమానంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన పథకాలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయడం ప్రారంభించింది. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం పెద్ద మార్పుగా నిలిచింది. ఉద్యోగాలు లేదా ఇతర పనుల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన మహిళలకు ఇది ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో మహిళల నుంచి విస్తృతమైన స్పందన వచ్చింది. అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ రూ.500కే అందించే విధంగా సబ్సీడీ అమలు చేయడం ద్వారా మహిళలపై పడే ఖర్చును తగ్గించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

ఇంకా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని కూడా ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటగా మారింది. విద్యుత్ ఖర్చు తగ్గడంతో కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గింది. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే సమయంలో అర్హుల ఎంపికలో పారదర్శకత పాటిస్తూ లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంది. పథకాలు సరైన వారికి చేరేలా పర్యవేక్షణ వ్యవస్థను కూడా బలోపేతం చేసింది.

ఆరోగ్య రంగంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్యశ్రీ పథకం పరిధిని విస్తరించి రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చులను భరించే విధంగా మార్పులు చేసింది. దీంతో పేదలకు ఖరీదైన వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స పొందే అవకాశం కలగడంతో పేద కుటుంబాలకు ఇది పెద్ద సహాయంగా మారింది. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను సాధారణ ప్రజలకు అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని మరింత విస్తరించింది ప్రభుత్వం.

రైతుల సంక్షేమం విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు మద్దతుగా నిలుస్తూ రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసింది. దాదాపు రూ.2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేయడం ద్వారా లక్షలాది మంది రైతులకు ఉపశమనం కలిగించింది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం సుమారు రూ.31,000 కోట్ల నిధులను కేటాయించింది. దాదాపు 40 లక్షల మంది రైతులకు ఈ రుణమాఫీ ద్వారా లాభం చేకూరింది. అదేవిధంగా రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి సహాయాన్ని అందిస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. రైతులు అప్పుల బారిన పడకుండా ఉండేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.

సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణను భవిష్యత్తులో బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందిస్తోంది. రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో విజన్- 2047 ప్రణాళికను రూపొందించింది. అలాగే పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

పేదలకు సొంత ఇల్లు కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రభుత్వం పునఃప్రారంభించింది. సొంత స్థలం ఉన్నా ఇల్లు కట్టుకోలేని పేదలకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి సొంతింటి కలను నిజం చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు ప్రయోజనం పొందే అవకాశముంది.

అయితే ప్రభుత్వంపై కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో హైడ్రా చర్యల పేరుతో పేదల ఇళ్లు కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. ఎఫ్‌టీఎల్ మరియు బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నా, ఈ చర్యలు పేదలపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పెద్దల నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల ఘటన కూడా ప్రభుత్వంపై విమర్శలకు దారితీసింది. ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను ఒక్కసారిగా కూల్చివేయడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది.

ఇక నిరుద్యోగుల సమస్య కూడా ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఎన్నికల తర్వాత కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినప్పటికీ జాబ్ క్యాలెండర్ అమలు కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియక నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. యువతకు ఇచ్చిన కొన్ని హామీలు అమలు కాలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

అయినప్పటికీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కొన్ని లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఉండవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.

ALSO READ: Missile Strike: ఖమేనీని ఎలా టార్గెట్ చేశారో తెలుసా?

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: