Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Telangana: ‘సర్’ అమలుకు సన్నాహాలు..ఆధారాలు లేకపోతే ఓటు తొలగింపు

Author
Posted By STAR TRINETHRAM
| 25 Feb 2026, 09:28 AM | Politics
Telangana: ‘సర్’ అమలుకు సన్నాహాలు..ఆధారాలు లేకపోతే ఓటు తొలగింపు

Telangana: ఓటరు జాబితా సమగ్ర ప్రక్షాళనకు సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాబోయే ఏప్రిల్ నెల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రక్షాళన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సరైన ధృవీకరణ పత్రాలు సమర్పించని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేలా కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే అధికారులు ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేస్తూ ఓటర్ల పూర్తి సమాచార సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. గణాంకాల ప్రకారం 2002లో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2.20 కోట్లుగా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 3.40 కోట్లకు చేరినట్లు గుర్తించారు. అంటే గతంతో పోలిస్తే దాదాపు 1.2 కోట్ల మంది ఓటర్లు పెరిగినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2002 సంవత్సరంలోని ఓటరు జాబితాను 2026 తాజా ఓటరు లిస్టుతో పోల్చి పూర్తిస్థాయి ప్రక్షాళన నిర్వహించనున్నారు.

ఓటరు జాబితా నవీకరణ ప్రక్రియలో బూత్ లెవల్ ఆఫీసర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించనున్నారు. వీరి ద్వారా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా కొనసాగించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తుది ఓటరు జాబితాను ప్రకటించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని అధికారులకు సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం సమాచార సేకరణను మరింత వేగవంతం చేసింది. గతంలో ఓటు నమోదు చేసుకున్న వారు ప్రస్తుతం అదే ప్రాంతంలో నివసిస్తున్నారా? లేదా వేరే నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రానికి వలస వెళ్లారా? లేక మరణించారా? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఇప్పటివరకు సుమారు 2 కోట్ల మంది ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 1.4 కోట్ల ఓటర్ల సమాచారాన్ని త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పనుల కోసం జిల్లా సహాయ ఎన్నికల నమోదు అధికారులకు ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటరు జాబితా తయారీ, సవరణ, నిర్వహణ విధానాలపై అవగాహన కల్పిస్తూ పారదర్శకతను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరు జాబితాలో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం, అవసరమైన సవరణలు చేయడం వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందిస్తున్నారు. అలాగే హైదరాబాద్ నగర ఓటరు జాబితాలో లక్షల సంఖ్యలో మృతుల పేర్లు ఉన్నట్లు గుర్తించడంతో ప్రత్యేక తనిఖీలు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఒక వ్యక్తికి రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్నట్లయితే, అందులో ఒక చోట మాత్రమే ఓటు కొనసాగించుకునే అవకాశం ఇవ్వనున్నారు. ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సహా వివిధ ప్రాంతాల్లో ఓటు నమోదైన వారి నుంచి ఆప్షన్లు స్వీకరించి ఒకే చోట ఓటు హక్కు కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఓటు హక్కు కొనసాగించాలంటే తప్పనిసరిగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పౌరసత్వ గుర్తింపునకు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కుటుంబ సభ్యుల వివరాలు, ఇతర అవసరమైన పత్రాలు సమర్పించడం తప్పనిసరిగా మారింది.

ఓటరు ప్రక్షాళన కార్యక్రమం నిర్వహణ అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. రాష్ట్ర జనాభాలో సుమారు 45 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు అంచనా. పట్టణాల్లో అపార్ట్‌మెంట్ వాసులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, కూలీలు వంటి విభిన్న వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో చాలామంది ఉదయం విధులకు వెళ్లడం వల్ల సమాచారం సేకరణ కష్టతరంగా మారుతోంది. కొంతమందిలో ఎన్నికల ప్రక్రియపై అనాసక్తి ఉండటం, ఓటరు జాబితా పట్ల నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల మ్యాపింగ్ పనులు కత్తిమీద సాములా మారాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ సమగ్ర, పారదర్శక ఓటరు జాబితా రూపొందించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.

ALSO READ: Apply: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్‌.. జీతం ఎంతో తెలుసా?

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: