Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

AP: కొణిదెల గ్రామానికి మహర్దశ.. ఆనందం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

Author
Posted By STAR TRINETHRAM
| 21 Feb 2026, 07:42 PM | Andhra Pradesh
AP: కొణిదెల గ్రామానికి మహర్దశ.. ఆనందం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

AP: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదెల గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వరుసగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం స్థానిక ప్రజల్లో విశేష ఆనందాన్ని కలిగిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్న ఈ గ్రామానికి ఇప్పుడు కొత్త ఊపిరి లభించినట్టైంది. ముఖ్యంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా తీసుకున్న నిర్ణయం గ్రామ చరిత్రలో మైలురాయిగా నిలిచింది.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కొణిదెల గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరగా, తన ఇంటి పేరుతో ఉన్న ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువస్తూ గత ఏడాది నందికొట్కూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ నిధులను గ్రామ అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు. గ్రామంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉన్నట్లు అధికారులు వివరించడంతో, అదే అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని 90,000 లీటర్ల సామర్థ్యంతో రక్షిత తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

సుమారు 2 వేల మందికి ఉపయోగపడే ఈ తాగునీటి ట్యాంక్ నిర్మాణం వేగంగా పూర్తికావడం విశేషం. వేసవి తీవ్రత మొదలయ్యే లోపే పనులు ముగియడంతో గ్రామ ప్రజలకు ఊరటనిచ్చింది. ఎన్నో ఏళ్లుగా వేసవికాలంలో నీటి కోసం ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఇది వరంగా మారింది. సకాలంలో పనులు పూర్తి చేసిన జిల్లా అధికార యంత్రాంగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తాను ఎప్పుడూ వెనుకాడనని స్పష్టం చేశారు.

కేవలం తాగునీటి ట్యాంక్ నిర్మాణమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొణిదెల గ్రామానికి విస్తృత స్థాయిలో నిధులు మంజూరయ్యాయి. ఇప్పటివరకు సుమారు రూ. 6 కోట్లకు పైగా నిధులు ఈ గ్రామ అభివృద్ధికి వినియోగించబడినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. పల్లెపండగ 1.0 కార్యక్రమంలో భాగంగా సుమారు రూ. 20 లక్షల నిధులతో మూడు అంతర్గత రహదారులు నిర్మించబడగా, గ్రామ రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. పల్లెపండగ 2.0 కింద రూ. 45 లక్షల అంచనాతో 7 సీసీ రోడ్లు మంజూరు చేయబడగా, ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ నిధులతో జిల్లా పరిషత్ పాఠశాల నుంచి పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల మేర బి.టి. రహదారి నిర్మాణానికి రూ. 4 కోట్లు కేటాయించబడింది. అలాగే ప్రధాన రహదారి నుంచి కొణిదెల గ్రామం వరకు ఉన్న మార్గాన్ని పునరుద్ధరించేందుకు రూ. 45 లక్షలు మంజూరయ్యాయి. ఈ రహదారి పనులు పూర్తికావడంతో గ్రామానికి రాకపోకలు మరింత సులభతరమయ్యే అవకాశం ఉంది.

గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు 4 గోకులాలు నిర్మించబడగా, గృహ నిర్మాణశాఖ సహకారంతో 19 ఇళ్లు పూర్తి చేశారు. అవసరమైన చోట్ల నీటితొట్టెలు ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించారు. వ్యవసాయాధారిత గ్రామమైన కొణిదెలలో రైతుల కోసం 49 ఫీడర్ కాలువలను జాతీయ ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి చేయడం ద్వారా సాగునీటి పంపిణీ సులభమైంది. రెండు చిన్న కాలువలను పునరుద్ధరించి, 3 కమ్యూనిటీ చెక్ డ్యామ్స్ మరమ్మత్తులు పూర్తి చేయడం ద్వారా భూగర్భ జలాల నిల్వ సామర్థ్యం పెరిగింది.

ఇచ్చిన మాట ప్రకారం గ్రామ ప్రజలు కోరిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తాగునీరు, రహదారులు, గృహాలు, సాగునీటి సదుపాయాలు వంటి మౌలిక వసతుల బలోపేతంతో కొణిదెల గ్రామం సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోంది. ఉప ముఖ్యమంత్రి చొరవతో గ్రామం అభివృద్ధి పథంలో నిలవడం స్థానికులకు నూతన ఆశలను నింపుతోంది.

ALSO READ: అమ్మాయిగా మారిన మాజీ క్రికెటర్ కొడుకు .. మరో ఆపరేషన్

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: