Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

PMKisan: రైతులకు నెల నెలా రూ.3 వేల పెన్షన్.. ఎవరు అర్హులంటే?

Author
Posted By STAR TRINETHRAM
| 16 Feb 2026, 05:34 PM | National
PMKisan: రైతులకు నెల నెలా రూ.3 వేల పెన్షన్.. ఎవరు అర్హులంటే?

PMKisan: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకాలలో చాలా వరకు రైతులు వ్యవసాయం చేస్తున్నంత కాలానికే పరిమితమవుతుంటాయి. వయసు పైబడిన తర్వాత శరీర శక్తి తగ్గడం, సాగు పనులు చేయలేని పరిస్థితి రావడం, స్థిరమైన ఆదాయ వనరులు లేకపోవడం వల్ల చాలా మంది రైతులు వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాతలకు భరోసాగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కీలక పథకం ఇప్పుడు రైతుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ స్కీమ్‌లో చేరితే వృద్ధాప్యంలో ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ ఈ పథకం గురించి ముందే తెలుసుకుని చేరితే, భవిష్యత్తులో ఆర్థిక ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది.

వయసు పైబడిన చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేరు ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన. ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే పింఛన్ విధానాన్ని పోలిన రీతిలో రైతులకు కూడా భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను రూపొందించారు. ఈ పథకంలో చేరిన రైతులు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు కనీసం రూ.3 వేల పెన్షన్ పొందవచ్చు. ఇది పూర్తిగా స్వచ్ఛంద పథకం కావడంతో రైతులు తమ ఇష్టానుసారం ఇందులో చేరవచ్చు. అయితే, ఈ స్కీమ్‌కు కొన్ని అర్హతలు, నిబంధనలు ఉంటాయి.

ఈ పథకంలో చేరాలంటే రైతుల వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతమైనా సరే, భూ రికార్డుల్లో రైతు పేరు ఉండాలి. అలాగే, గరిష్టంగా 2 హెక్టార్ల వరకు సాగుభూమి కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈఎస్ఐ, ఈపీఎఫ్‌వో వంటి ఇతర సామాజిక భద్రత పథకాల పరిధిలో ఉన్నవారు ఈ స్కీమ్‌లో చేరడానికి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, ఇప్పటికే పింఛన్ పొందుతున్నవారు, ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులు కారు.

ఈ పథకంలో చేరిన రైతులు ప్రతి నెలా ఒక చిన్న మొత్తాన్ని ప్రీమియంగా చెల్లించాలి. ఈ ప్రీమియం రూ.55 నుంచి రూ.200 వరకు ఉంటుంది. అయితే ఇది రైతు చేరే సమయంలో ఉన్న వయసును బట్టి నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో చేరిన రైతు నెలకు రూ.55 చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని తన వాటాగా జమ చేస్తుంది. ఈ విధంగా రైతు వయసు 60 ఏళ్లు నిండే వరకు ప్రతినెలా ప్రీమియం చెల్లించాలి. రైతు చెల్లించే మొత్తానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లించడం ఈ పథకంలో ప్రధాన ప్రత్యేకతగా చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ స్కీమ్‌లో చేరిన రైతు మరణిస్తే.. ఆయన లేదా ఆమె జీవిత భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. రైతు 60 ఏళ్లు నిండకముందే మరణించినా, నిర్ణీత నిబంధనల ప్రకారం జీవిత భాగస్వామికి పింఛన్ లభిస్తుంది. ఒకవేళ 60 ఏళ్ల తర్వాత రైతు మరణిస్తే, జీవిత భాగస్వామికి సగం పెన్షన్ అందజేస్తారు. అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే రైతు కనీసం ఐదేళ్ల పాటు తన వాటా ప్రీమియంను నిర్దేశిత సమయానికి కట్టాలి.

ఈ పథకంలో చేరేందుకు రైతుకు కొన్ని కీలక పత్రాలు అవసరం అవుతాయి. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, నివాస ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, వయసు నిర్ధారణకు ఆధార్ లేదా ఓటర్ కార్డు, సాగుభూమి ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి.

అర్హత కలిగిన రైతులు తమకు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు దరఖాస్తును పరిశీలించి అర్హత నిర్ధారించిన తర్వాత రైతు బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఈ విధంగా నిర్ణీత కాలం పాటు ప్రీమియం చెల్లించిన రైతులు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ పొందుతారు. వృద్ధాప్యంలో అన్నదాతలకు భరోసా కల్పించే ఈ పథకం భవిష్యత్తును భద్రమైనదిగా మార్చే మంచి అవకాశంగా నిపుణులు చెబుతున్నారు.

ALSO READ: Ring of Fire: రేపే సూర్యగ్రహణం.. పండితులు ఏం చెప్పారంటే?

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: