Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

AP: స్వర్ణాంధ్ర దిశగా ఏపీ అడుగులు.. రూ.3.32 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్!

Author
Posted By STAR TRINETHRAM
| 14 Feb 2026, 07:44 PM | Andhra Pradesh
AP: స్వర్ణాంధ్ర దిశగా ఏపీ అడుగులు.. రూ.3.32 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్!

AP: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,32,205 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే ద్వంద లక్ష్యాలతో సిద్ధం చేసినదిగా మంత్రి వెల్లడించారు. గణాంకాల సమాహారం మాత్రమే కాకుండా, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి బలమైన ఆర్థిక ప్రణాళికగా ఈ బడ్జెట్ నిలుస్తుందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.

వార్షిక వ్యయం రూ.3,32,205 కోట్లుగా ప్రతిపాదించగా, అందులో రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లు గా నిర్ణయించారు. రెవెన్యూ లోటు రూ.22,022.50 కోట్లుగా, ఆర్థిక లోటు రూ.75,868.09 కోట్లుగా అంచనా వేశారు. రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా మూలధన వ్యయాన్ని కేటాయించడం ఈ బడ్జెట్ ప్రత్యేకతగా నిలిచింది.

బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం సంఖ్యల ప్రదర్శన కాదని, రాష్ట్రాభివృద్ధి మరియు ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా సమాంతరంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ పథకమని స్పష్టం చేశారు. 5 కోట్ల ఆంధ్రుల ఆశయాలను ప్రతిబింబిస్తూ “స్వర్ణాంధ్ర-2047” లక్ష్య సాధన దిశగా ఈ ఆర్థిక ప్రణాళిక రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తూనే సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా లోటు రాకుండా సమతుల్యత పాటించామని వివరించారు.

రాష్ట్ర ఖజానాకు రానున్న ఆదాయ వనరుల వివరాలను కూడా మంత్రి వెల్లడించారు. రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రూ.1,25,845 కోట్లు సమకూరనున్నాయని అంచనా వేశారు. కేంద్ర పన్నుల వాటాగా రూ.64,362 కోట్లు లభించనున్నాయి. పన్నేతర ఆదాయం రూపంలో రూ.11,473 కోట్లు రానున్నట్లు తెలిపారు. ఈ ఆదాయ ఆధారాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను స్థిరపరచడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

బడ్జెట్ ముఖ్యాంశాలపై దృష్టి సారిస్తే విద్య, వైద్యం, మౌలిక వసతులు, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకానికి రూ.27,719 కోట్లు మంజూరు చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు రూ.17,306 కోట్లు కేటాయించడం ద్వారా ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడించారు.

రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తూ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు రూ.30,000 కోట్లు కేటాయించారు. హార్టికల్చర్ క్లస్టర్ల ఏర్పాటుకు కూడా ఇదే మొత్తాన్ని ప్రతిపాదించారు. రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్ధికి రూ.13,546 కోట్లు మంజూరు చేయగా, విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు కేటాయించారు. పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.3,161 కోట్లు ప్రతిపాదించారు.

మనబడి-మన భవిష్యత్తు పథకానికి రూ.1,500 కోట్లు కేటాయించగా, స్వచ్ఛ భారత్ మిషన్ అమలుకు రూ.1,037 కోట్లు మంజూరు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ రూపుదిద్దుకున్నదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ బడ్జెట్ సాగుతుందని తెలిపారు.

ALSO READ: Agniveer: 25 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: