Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అబ్బో.. మాములుగా లేదుగా ఇతడి కథ.. టిప్ టాప్‌గా తిరుగుతాడు, ఇళ్లను గుల్ల చేసేస్తాడు!

Author
Posted By STAR TRINETHRAM
| 11 Feb 2026, 10:35 PM | Andhra Pradesh
అబ్బో.. మాములుగా లేదుగా ఇతడి కథ.. టిప్ టాప్‌గా తిరుగుతాడు, ఇళ్లను గుల్ల చేసేస్తాడు!

వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. కానీ ప్రవృత్తిగా పక్కా దొంగ. వెలుపల చూస్తే టిప్‌టాప్ డ్రెస్సింగ్, విలాసవంతమైన కారు, స్నేహితులతో పార్టీలు.. ఇలా ఒక హైఫై లైఫ్ స్టైల్. కానీ ఆ విలాసాల వెనుక దాగి ఉన్న అసలు కథ మాత్రం షాకింగ్. విశాఖ నగరాన్ని వణికించిన ‘ముసుగు దొంగ’గా పేరుపడ్డ యువకుడు చివరకు పోలీసుల వలలో చిక్కాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 26 ఇంటి దొంగతనాలకు పాల్పడి నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నేరాల చిట్టా బయటపడడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ విశాఖలోని మాధవధారలో నివాసం ఏర్పరుచుకున్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రముఖ ఐటీ సంస్థలో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాడు. సాధారణంగా చూస్తే స్థిరమైన జీవితం, మంచి వృత్తి, భవిష్యత్‌కు బలమైన పునాది అన్నీ ఉన్నట్టే కనిపించాయి. కానీ అతని ఆలోచనలు మాత్రం వేరే దారిలో నడిచాయి. విలాసవంతమైన జీవితం, ఖరీదైన వస్తువులు, లగ్జరీ కార్లు, పార్టీలపై మోజు పెరిగింది. ఉద్యోగంతో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో దొంగతనాలే అతనికి అదనపు ఆదాయ మార్గంగా మారాయి.

అవకాశం దొరికినప్పుడల్లా విశాఖకు చేరుకుని ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేసేవాడు. ఎప్పుడూ ఒంటరిగానే వెళ్లడం, ముఖానికి ముసుగు ధరించడం, చేతులకు గ్లౌజులు వేసుకోవడం అతని ప్రత్యేక శైలి. సీసీ కెమెరాలు ఉన్నా గుర్తుపట్టలేని విధంగా జాగ్రత్తలు తీసుకునేవాడు. అందుకే పోలీస్ విభాగంలో అతనికి ‘ముసుగు దొంగ’ అనే పేరు ఏర్పడింది.

గాజువాక జోగివానిపాలెంలో గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన చోరీ కేసు ఈ నేరాల గుట్టును విప్పింది. శివరామకృష్ణ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి అరుణాచలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గమనించిన మహేష్ రెడ్డి ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. దాదాపు 17 తులాల బంగారం, 30 తులాల వెండి వస్తువులు ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసిన గాజువాక క్రైమ్ పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా కదలికలు కనిపించినప్పటికీ ముఖం పూర్తిగా కప్పుకున్నందున స్పష్టత రాలేదు.

నాలుగు నెలలపాటు సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలు, పాత కేసుల సరిపోలింపులు పరిశీలించిన తర్వాత చివరకు మహేష్ రెడ్డి అదుపులోకి వచ్చాడు. విచారణలో అతను ఒప్పుకున్న వివరాలు పోలీసులను షాక్‌కు గురిచేశాయి. గాజువాక మాత్రమే కాకుండా ఆరిలోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు చోరీల వెనుక కూడా అతడే ఉన్నట్టు తేలింది.

ఇవి కూడా చదవండి

చోరీ చేసిన సొమ్ముతో మహేష్ రెడ్డి లగ్జరీ జీవితాన్ని ఆస్వాదించాడు. ఖరీదైన BMW కారు కొనుగోలు చేసి దానిలో తిరుగుతూ స్నేహితులకు పార్టీలు ఇచ్చేవాడని పోలీసులు వెల్లడించారు. తాజాగా కూడా ఒక చోరీ అనంతరం ఫ్రెండ్స్‌కు పార్టీ ఏర్పాటు చేసినట్టు విచారణలో బయటపడింది. నేరంతో సంపాదించిన డబ్బుతో విలాసాలను ఆస్వాదించడం అతనికి అలవాటైపోయిందని అధికారులు పేర్కొన్నారు.

మొత్తం 26 కేసుల్లో సుమారు 1084.94 గ్రాముల బంగారం అపహరించినట్టు గుర్తించారు. అందులో 699 గ్రాముల బంగారం, 3.805 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీ సొమ్ముతో కొనుగోలు చేసిన BMW కారుతో పాటు నేరాలకు వినియోగించిన మరో స్కూటీని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఐరన్ రాడ్, సుత్తి, స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, డ్రిల్లింగ్ మిషన్, మాస్క్, గ్లౌజులు వంటి పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

మహేష్ రెడ్డి నేరచరిత్ర కొత్తది కాదని పోలీసులు చెబుతున్నారు. 15 ఏళ్ల వయసులోనే నాలుగు చోరీలకు పాల్పడినట్టు రికార్డులు సూచిస్తున్నాయి. జువెనైల్ హోమ్ నుంచి విడుదలైన తర్వాత కూడా తన పాత అలవాటును మానుకోలేదు. కాకినాడ, సర్పవరం, రామచంద్రాపురం, ఇంద్రాలపాలెం, రాజమండ్రి ప్రాంతాల్లో దాదాపు 32 కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో 14 నెలల శిక్ష కూడా అనుభవించాడు. మొత్తంగా అతనిపై 60కి పైగా ఇంటి దొంగతనం కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌లో ఉద్యోగం కొనసాగిస్తూ, మధ్య మధ్యలో విశాఖకు వచ్చి చోరీలు చేసి తిరిగి వెళ్లడం అతని వ్యూహమని క్రైమ్ అధికారులు తెలిపారు. బయటకు చూస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, లోపల మాత్రం పక్కా నేరస్తుడు అన్నట్టు అతని ద్వంద్వ జీవితం సాగింది. ఎట్టకేలకు ముసుగు దొంగ అరెస్టుతో నగర ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మరిన్ని నేరాలు జరగకుండా ముందుగానే కట్టడి చేయగలిగామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ALSO READ: Beach Trip: మీరు బీచ్‌కి వెళ్తే.. వెళ్లండి కానీ.. వీటిని పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకండి!

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: