Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

History: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక ‘మేడారం’

Author
Posted By STAR TRINETHRAM
| 29 Jan 2026, 02:07 PM | Telangana
History: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక ‘మేడారం’

History: తెలంగాణ గిరిజన చరిత్రలో, ప్రజా పోరాటాల వారసత్వంలో సమ్మక్క- సారలమ్మలు కేవలం దేవతలుగా మాత్రమే కాదు.. అణచివేతకు వ్యతిరేకంగా ఆయుధం ఎత్తిన వీరోచిత వనితలుగా నిలిచిపోయారు. కాకతీయుల సైన్యాన్ని గడగడలాడించిన ధైర్యవంతులైన ఈ తల్లి- కుమార్తె కథే నేటికీ మేడారం మహాజాతర రూపంలో జీవంతంగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందిన ఈ జాతర, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది.

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దట్టమైన అడవులు, కొండకోనల మధ్య ఉన్న మేడారం గ్రామంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క- సారలమ్మ జాతరకు దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. కుంభమేళా తర్వాత భారతదేశంలో అత్యధిక జనసందోహం ఏర్పడే పండుగగా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

సమ్మక్క కథ గిరిజన జీవన విధానానికి, పోరాట చరిత్రకు అద్దం పడుతుంది. జగిత్యాల ప్రాంతంలోని పోలవాసను పాలించిన గిరిజన దొర మేడరాజు వేటకు వెళ్లిన సమయంలో ఒక పుట్టపై కేరింతలు కొడుతూ కనిపించిన బాలికనే సమ్మక్కగా పెంచుకున్నాడు. ఆమె చేతి ఆకు పసరుతో వ్యాధులు నయమవుతాయన్న నమ్మకం ప్రజల్లో విస్తరించింది. ఆమెను మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేయగా, ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే సంతానం జన్మించారు.

రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పోలవాసపై దండెత్తడంతో పరిస్థితులు మారాయి. కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేకపోయిన పగిడిద్దరాజు, మేడరాజుకు ఆశ్రయం కల్పించడంతో గిరిజనులపై తిరుగుబాటు ముద్ర వేసి కాకతీయులు మేడారంపై దాడి చేశారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున యుగంధరుడి నేతృత్వంలో వచ్చిన కాకతీయ సేనలకు ఎదురుగా నిలబడి సమ్మక్క, సారలమ్మ, జంపన్న, గోవిందరాజులు గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించారు.

సాంప్రదాయ ఆయుధాలతో సుశిక్షితమైన కాకతీయ సేనలను ఎదుర్కొంటూ వీరోచితంగా పోరాడిన గిరిజన యోధులు చివరికి యుద్ధంలో వీరమరణం పొందారు. పరాజయ వార్తతో జంపన్న సంపెంగ వాగులో దూకి ప్రాణాలు తీసుకోగా, ఆ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. సమ్మక్క మాత్రం యుద్ధభూమిలో చివరి వరకు పోరాడుతూ, రక్తధారలతో చిలుకల గుట్ట వైపు వెళ్లి మార్గమధ్యంలో అదృశ్యమైంది.

ఇవి కూడా చదవండి

ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు పసుపు కుంకుమలతో ఉన్న భరణి మాత్రమే లభించింది. అదే సమ్మక్క స్వరూపంగా భావించి, అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మహాజాతర నిర్వహిస్తున్నారు. జాతరలో మొదట కన్నెపల్లి నుంచి సారలమ్మ రాక, ఆపై చిలుకల గుట్ట నుంచి భరణి రూపంలో సమ్మక్క గద్దెపైకి రావడం, చివరికి వనప్రవేశంతో జాతర ముగియడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

ఈ జాతరలో మరో విశేషం వంశపారంపర్యంగా గిరిజనులే పూజార్లుగా వ్యవహరించడం. భక్తులు అమ్మవార్లకు బంగారం రూపంలో బెల్లం సమర్పిస్తూ తమ కోరికలు వేడుకుంటారు. సమ్మక్క- సారలమ్మలను కేవలం దేవతలుగా మాత్రమే కాకుండా, కోయ గిరిజనుల హక్కుల కోసం రాజ్యాధికారాన్ని ఎదిరించిన విప్లవ వీర వనితలుగా గుర్తించాల్సిన అవసరం ఉందన్న భావన ఈ జాతర ద్వారా తరతరాలకు చేరుతోంది.

వ్యాసకర్త: ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పసుల వినయ్ కుమార్

ALSO READ: Mahesh Kumar Goud: ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం సిట్‌కు ఉంది

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: