Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

MLC Nagababu: జెండా ఆవిష్కరణ విద్యార్థుల చేతుల మీదుగా చేయించాలి

Author
Posted By STAR TRINETHRAM
| 26 Jan 2026, 11:04 AM | Andhra Pradesh
MLC Nagababu: జెండా ఆవిష్కరణ విద్యార్థుల చేతుల మీదుగా చేయించాలి


MLC Nagababu: భారతదేశానికి స్వాతంత్ర్యం, గణతంత్ర విలువలు యాదృచ్ఛికంగా రాలేదని, దేశం కోసం కుటుంబాన్ని, సుఖాన్ని, ఆఖరికి ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావుల పోరాట ఫలితమే నేటి భారతమని శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. ఈ త్యాగాల గాథలను రాబోయే తరాలకు బోధించడమే కాకుండా, దేశభక్తి భావన విద్యార్థుల హృదయాల్లో బలంగా నాటాలని ఆయన పిలుపునిచ్చారు.



ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం నాగబాబు మాట్లాడుతూ.. దేశభక్తి మాటల్లో కాకుండా, ఆచరణలో కనిపించాలన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు దేశంపై ప్రేమ, బాధ్యత భావన అలవడితేనే నిజమైన పౌరులుగా ఎదుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు.



భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు అనే ప్రతిజ్ఞ ప్రతి విద్యార్థి నోట నిత్యం వినిపించాలని ఆయన సూచించారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రతిజ్ఞ కొనసాగుతున్నప్పటికీ.. ప్రైవేట్ పాఠశాలల్లో చాలావరకు దీన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో జాతీయ భావన పెంపొందాలంటే ప్రతిజ్ఞ తప్పనిసరిగా చేయించాల్సిన అవసరం ఉందన్నారు.



కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా మనమంతా భారతీయులమే అన్న భావన ఈ ప్రతిజ్ఞలో నిండి ఉందని నాగబాబు వివరించారు. దేశ గౌరవాన్ని గుర్తించడం, దేశం కోసం పనిచేయడం, అవసరమైతే దేశ పరిరక్షణకు ముందుకు రావడం వంటి విలువలు బాల్య దశలోనే విద్యార్థుల్లో నాటాలని అన్నారు. గణతంత్ర దినోత్సవం వంటి సందర్భాలు కేవలం సెలవు దినాలుగా కాకుండా, దేశాన్ని గుర్తు చేసే దినాలుగా మారాలని సూచించారు.

ఇవి కూడా చదవండి



విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి నాయకులు అని, వారి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ జరగడం దేశ భవిష్యత్తుకు మంచి సంకేతమని నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ తరహా కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఆత్మగౌరవం, దేశాభిమానం మరింత బలపడుతుందని చెప్పారు.



ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వినీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు డాక్టర్ పంచకర్ల సందీప్, జనసేన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్, అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గేదెల చైతన్య, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గర్భాన సత్తిబాబు, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ దుర్గారావు, జీసీసీ డైరెక్టర్ నిబ్రమ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎచ్చెర్ల, ఆముదాలవలస, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.



దేశాన్ని ప్రేమించడం అంటే కేవలం మాటల వరకే పరిమితం కాకుండా, దేశ శ్రేయస్సుకు తాము చేయగలిగిన బాధ్యతను నిర్వర్తించడమేనని నాగబాబు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం దేశాన్ని గుర్తు చేసే పర్వదినమని, ఆ రోజు చెప్పిన మాటలు ఏడాది పొడవునా ఆచరణలో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.


మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: