Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Ponguleti Srinivas Reddy: భూభారతి చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం

Author
Posted By STAR TRINETHRAM
| 26 Jan 2026, 10:56 AM | Politics
Ponguleti Srinivas Reddy: భూభారతి చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం


Ponguleti Srinivas Reddy: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, గతంలో ధరణి పేరుతో రైతులను మోసం చేసిన పాలనకు భిన్నంగా నేడు రైతుకు చుట్టంలా నిలిచే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి భూ సమస్యలకు పరిష్కారం చూపుతోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలను గుండెతో అర్థం చేసుకుని, వారి జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చేలా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.



సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్‌తో కలిసి ప్రభుత్వం నుంచి అర్హులైన రైతులకు మంజూరైన సబ్సిడీ వ్యవసాయ యంత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు.



గడచిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని కోరుకున్నారని, రైతుల బాధలు తీరాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిందే అన్న భావనతోనే ప్రజలు తీర్పు ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసిన బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారని, రైతులకు మేలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరిచారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల పాలిట శాపంగా మారిన ధరణి వ్యవస్థను పూర్తిగా పక్కనపెట్టి, భూభారతి చట్టం ద్వారా భూ తగాదాలకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేసినట్లు వివరించారు.



గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వరి వేస్తే ఉరి అన్న పరిస్థితి నెలకొందని మంత్రి విమర్శించారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నధాన్యం పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పడమే కాకుండా, ఆ మాటను కార్యరూపంలో పెట్టి క్రమం తప్పకుండా రైతులకు బోనస్ అందజేస్తోందని స్పష్టం చేశారు. ఇదే ప్రజా పాలనకు, రైతు పక్షపాత ప్రభుత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.



నాటి ప్రభుత్వం కేవలం రైతు బంధు పేరిట ఒక సాయం చేసి చేతులు దులుపుకుందని, కానీ ప్రజా ప్రభుత్వంలో రైతు భరోసా, పంట బోనస్‌తో పాటు వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించడం ద్వారా రైతుల ఖర్చులు తగ్గించి, ఉత్పత్తి సామర్థ్యం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ రోజు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులకు రూ.3.16 కోట్ల విలువైన వ్యవసాయ పనిముట్లను అందజేసినట్లు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి


రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవసాయ యంత్రాలను దఫాల వారీగా రైతులకు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వ్యవసాయం లాభసాటిగా మారాలంటే రైతుకు కావాల్సిన అన్ని వనరులను ప్రభుత్వమే సమకూర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వసిస్తోందన్నారు. అందుకే యంత్రాల పంపిణీని ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని తెలిపారు.



ప్రజల సుభిక్షం, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, విద్యార్థులకు కాస్మొటిక్ మెస్ ఛార్జీల పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే రాష్ట్రంలో సుమారు 26 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని గర్వంగా చెప్పారు.



గత పాలకులు పదేళ్లపాటు అధికారంలో ఉన్నా రైతు రుణమాఫీ చేయకుండా రైతులను అరిగోస పెట్టారని మంత్రి విమర్శించారు. అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో పేదలను మోసం చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక పేదల సమస్యలకు పరిష్కారం చూపేలా పనిచేస్తోందన్నారు.



ఇండ్లు లేని నిరుపేదలకు త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నామని మంత్రి వెల్లడించారు. వచ్చే ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేపడతామని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే లక్ష్యమని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేని పేదలకు 72 గజాల చొప్పున స్థలాలు కేటాయించే మహత్తర కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.



ప్రజలకు అన్ని విధాలా మేలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో తప్పకుండా గెలిపించాలని మంత్రి కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సరిత మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు క్రమం తప్పకుండా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు, యువ నాయకులు, మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: