Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Uttam Kumar Reddy: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవ్వాలి

Author
Posted By STAR TRINETHRAM
| 26 Jan 2026, 10:48 AM | Politics
Uttam Kumar Reddy: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవ్వాలి


Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేగంగా వేడెక్కుతోంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో, ఇక ఎన్నికల నగారా మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని, అదే సమయంలో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి రెండో వారంలోనే పోలింగ్ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి కీలక ప్రకటన చేశారు.



నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ ఎన్నికలపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను పార్టీ శ్రేణులకు వివరించారు. ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ మన ద్వారా ఒక్క ఓటు పడుతుందనే భావనతో పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికలను అత్యంత సీరియస్‌గా తీసుకుని, ప్రతి వార్డుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేశారు.



ఈసారి జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో నిజామాబాద్ చరిత్రే మారేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేయాలని మంత్రి ఉత్తమ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎంతో దూరంలో లేవని, సమయం చాలా కీలకమని ఆయన గుర్తు చేశారు. ఆశావహులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, టికెట్ల కేటాయింపులో పార్టీ విజయం మాత్రమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.



టికెట్ దక్కని వారు కూడా నిరాశకు గురి కాకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు. అటువంటి కార్యకర్తలకు ప్రభుత్వంలో తగిన గుర్తింపు, న్యాయం జరిగేలా తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా అందరూ సైనికుల్లా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.



కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అసలైన బలం, మూలస్తంభాలని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరూ ఈ విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు, గౌరవం ఉంటుందని హామీ ఇచ్చారు. క్రమశిక్షణతో, ఐక్యతతో ముందుకు సాగితే విజయం ఖాయమని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి



తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉందని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గర్వంగా ప్రజల్లో చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తోందని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేలా పాలన సాగిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వాటి ఆధారంగా ఓట్లు అడగాలని కార్యకర్తలకు సూచించారు.



రాష్ట్రంలోని అన్ని అర్బన్ ప్రాంతాల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను నెక్స్ట్ లెవెల్ అభివృద్ధికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ సహా రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు భారీ నిధులు మంజూరు చేసి అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు.



పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదలకు మేలు జరిగేలా కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, సన్నబియ్యం పంపిణీ చేపట్టామని తెలిపారు. సివిల్ సప్లయ్స్ మంత్రిగా సన్నబియ్యం పంపిణీ తనకు అత్యంత సంతృప్తినిచ్చిన అంశమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చే దిశగా సాగుతున్నాయని అన్నారు.



ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: