HomePOLITICALMission 2028: కోటి ఓట్లు- 90 సీట్లే టార్గెట్... 2.0 లక్ష్యంగా రేవంత్ మాస్టర్...

Mission 2028: కోటి ఓట్లు- 90 సీట్లే టార్గెట్… 2.0 లక్ష్యంగా రేవంత్ మాస్టర్ ప్లాన్‌!

📰 Generate e-Paper Clip

మిషన్ 2028..ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడే యుద్ధభూమిని సిద్ధం చేస్తోంది. పీఏసీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి…కోటి ఓట్లు — 90 అసెంబ్లీ సీట్లు అనే భారీ లక్ష్యాన్ని ప్రకటించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు అలాగే అంతర్గత అసంతృప్తులను కట్టడి చేసేందుకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకువస్తున్నారు.

ఎన్నికల వ్యూహాలను రూపొందించడానికి, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కీలక నేతలతో కూడిన కోర్ కమిటీ రంగంలోకి దిగింది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రతి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పథకాలపై ప్రజల స్పందన, పార్టీ గ్రాఫ్‌పై ప్రత్యేక సర్వేల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యే గ్రాఫ్ తగ్గుతున్నట్లు గుర్తిస్తే వెంటనే వారితో చర్చించి దిద్దుబాటు చర్యలు సూచిస్తున్నారు. మాట వినని వారి స్థానంలో లేదా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తగా ఏర్పడే సెగ్మెంట్ల కోసం యువ నాయకులు, కొత్త తరం అభ్యర్థులను గుర్తించే పనిని ఇప్పటికే మొదలుపెట్టారు. ముఖ్యంగా కోమటిరెడ్డి, అనిరుధ్ రెడ్డి వంటి నేతల వ్యవహారశైలి…వ్యాఖ్యలపై అధిష్టానంతో సమన్వయం చేసుకుంటూ కట్టడి చేసే దిశగా వ్యూహాలు అల్లుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి నమ్మకమైన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేయడం ద్వారా ఏ ఒక్కరిపైనా పూర్తిగా ఆధారపడకుండా బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి పార్టీపై, ప్రభుత్వంపై తన పట్టును మరింత సుస్థిరం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యత కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలో పటేల్ రమేష్ రెడ్డి వంటి నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మరింత చురుగ్గా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఉమ్మడి నల్గొండతో పాటు మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ విశ్వసనీయ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం…స్థానిక సంస్థలు మరియు నామినేటెడ్ పదవుల ద్వారా వారికి బలం చేకూర్చడం వంటి చర్యలు చేపట్టేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు రేవంత్.

సంస్థాగత మార్పులే కాకుండా ఓటు బ్యాంకును కోటి మార్కుకు చేర్చడానికి సంక్షేమ, రాజకీయ అస్త్రాలను కూడా సిద్ధం చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు, మహిళలకు ఆర్థిక సాయం, చేయూత పెన్షన్ల పెంపు, యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పన చర్యలతో ప్రజల్లో సానుకూలత టార్గెట్‌గా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ద్వితియ శ్రేణి నేతలు, బలమైన స్థానిక నేతలను కాంగ్రెస్ వైపు ఆకర్షించడం…ప్రత్యర్థి పార్టీలకు పట్టున్న స్థానాల్లో ప్రత్యేక ప్రణాళికలతో ఆధిపత్యం సాధించడం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకు సబ్సిడీ ధరపై (రూ. 500) ఎల్పీజీ సిలిండర్ అందిస్తున్నారు.గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ‘జీరో బిల్’ అమలవుతోంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య బీమా పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నారు.

అలాగే రైతు భరోసా పేరుతో ఎన్నికల హామీలో ఏటా ఎకరాకు రూ. 15,000 ఇస్తామని ప్రకటించినప్పటికీ ప్రభుత్వం దీనిని ఎకరాకు రూ. 12,000 (రెండు సీజన్లకు కలిపి రూ. 6,000 చొప్పున) చొప్పున సాగులో ఉన్న భూములకు అందిస్తోంది. వరి (సన్న వడ్లకు) క్వింటాకు రూ. 500 బోనస్ అమలు చేస్తున్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12,000 (రెండు విడతలుగా రూ. 6,000 చొప్పున) అందించే పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఉపాధి హామీ పనిదినాల నిబంధనలు, పైలట్ గ్రామాల ఎంపిక కారణంగా క్షేత్రస్థాయిలో పరిమిత సంఖ్యలో మాత్రమే లబ్ధిదారులకు అందుతోంది.

సొంత స్థలం ఉన్న అర్హులకు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం విడతల వారీగా మంజూరు చేస్తున్నారు. అయితే ఇంటి స్థలం లేని వారికి స్థలం కేటాయింపు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం హామీలు ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలెక్కలేదు. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డుకు బదులుగా, నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో రాయితీ రుణాల పథకాన్ని, మండల స్థాయిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది.

ఒంటరి మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం… మహాలక్ష్మి పథకంలో అత్యంత కీలకమైన ఈ నగదు బదిలీ పథకం ఇంకా ప్రారంభం కాలేదు. భూమి యజమానులకు సాయం అందుతున్నా కౌలు రైతుల గుర్తింపు మరియు వారికి పెట్టుబడి సాయం అందించే ప్రక్రియ ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు ఇస్తామన్న నేరుగా రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు హామీ ఇంకా కార్యరూపం దాల్చలేదు

ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో కొత్త ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించారు రేవంత్. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగితే పెరిగే కొత్త స్థానాలకు ఇప్పటి నుంచే యువ నాయకులు, కొత్త ముఖాలను సిద్ధం చేస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రేషన్ కార్డు లబ్దిదారులతో పాటు కాంగ్రెస్ సాంప్రదాయ ఓటింగ్‌తో గట్టెక్కుతాననే ధీమాతో ఉన్నారు రేవంత్. మొత్తంగా ఒకవైపు ఆర్థిక భారాలను సమతుల్యం చేసుకుంటూనే సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారులకు చేరవేయడం మరోవైపు సర్వేలు, సంస్థాగత మార్పులతో వచ్చే ఎన్నికల్లో విజయమే టార్గెట్‌ సీఎం రేవంత్ పావులు కదుపుతుండగా మిషన్ 2028 ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.

RELATED ARTICLES

Most Popular