ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా మున్సిపల్, ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలతో పోలిస్తే సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు అభ్యర్థులు. అభివృద్ధి పనుల పేరిట అభ్యర్థులు కోట్ల రూపాయలు, విలువైన భూములను గ్రామాలకు రాసిచ్చేందుకు ముందుకొస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా దుళ్ల గ్రామంలో సర్పంచ్ పీఠం కోసం ఏకంగా కోట్లలో బేరసారాలు సాగుతున్నాయి. తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ.కోటి ఇస్తానని ఒక వ్యక్తి ప్రకటించగా అదే గ్రామానికి చెందిన ఓ ఎంబీబీఎస్ (MBBS) విద్యార్థిని ఒక అడుగు ముందుకేసి ఏకంగా రూ.1.50 కోట్లు ఇస్తానని హామీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అలాగే పశ్చిమగోదావరి జిల్లా తూర్పుతాళ్లు గ్రామంలోనూ ఇదే తరహా పోటీ నెలకొంది. అక్కడ ఒక అభ్యర్థి రూ.50 లక్షల నగదు ఇస్తానని చెప్పగా మరొకరు ఏకంగా ఎకరం పొలం గ్రామానికి రాసిస్తానని ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఆలయాల నిర్మాణం, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల కోసం రూ.30 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు విరాళాలు ఇచ్చేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు.
అభ్యర్థుల నుంచి ఊహించని స్థాయిలో ఆఫర్లు వెల్లువెత్తుతుండటంతో ఇప్పుడు ఇదే స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అదునుగా భావిస్తున్న గ్రామ పెద్దలు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకునేలా తీర్మానాలు చేస్తున్నారు.
ఒక సర్పంచ్ అభ్యర్థి తన పదవి కోసం డబ్బులు పంచడం చూశాము కానీ గ్రామాభివృద్ధి కోసం కోటి రూపాయలు సొంతంగా ఇస్తానని ముందుకు రావడం గొప్ప విషయమని స్థానికులు కొనియాడుతున్నారు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం పదవుల వేలం పాటలు చట్టవిరుద్ధం కాగా గ్రామాభివృద్ధి పేరుతో ఏకగ్రీవాల పర్వం జోరుగా సాగుతోండటం విశేషం.


