HomeTELANGANAAI Police Station:దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం..తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌ ఎక్కడో తెలుసా!

AI Police Station:దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం..తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌ ఎక్కడో తెలుసా!

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించనుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసు వ్యవస్థకు జోడించి, అత్యాధునిక సేవలను అందించేందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పోలీస్ స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారు. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో ఇది లాంఛనంగా ప్రారంభం కానుంది.

ఈ సాంకేతిక మార్పులపై సమీక్షించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు అక్కడకు వచ్చే ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఏఐ (AI) పోలీస్ స్టేషన్ ప్రత్యేకతలు..

ఫిర్యాదు అందజేయడం నుంచి ఎఫ్‌ఐఆర్ నమోదు, కేస్ డైరీల నిర్వహణ, దర్యాప్తు నివేదికలు మరియు చార్జిషీట్ తయారీ వరకు ప్రతి ప్రక్రియలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించనుంది. ఇది పౌర కేంద్రీకృత పోలీసు వ్యవస్థ వైపు వేస్తున్న చారిత్రాత్మక అడుగు అని సీవీ సజ్జనార్ పేర్కొన్నారు.

ఏఐ ఎనేబుల్డ్ ‘సేతు’ కియోస్క్ (Setu Kiosk): ఈ స్టేషన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏఐ కియోస్క్ ద్వారా ఫిర్యాదుదారులు సుమారు 10 విభిన్న భాషల్లో తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఫిర్యాదులను స్థానిక భాషలోకి అనువదించి సంబంధిత అధికారులకు పంపుతుంది.

పంజాగుట్ట పరిధిలోని ట్రాఫిక్ రద్దీ, హాస్టళ్లు, వాణిజ్య సంస్థలు, నేరాల సరళి వంటి సమగ్ర సమాచారాన్ని ఏఐ విశ్లేషించనుంది. దీనిద్వారా బ్లూ కోల్ట్స్ పెట్రోలింగ్ విధానాన్ని మరింత ఆప్టిమైజ్ చేసి, నిఘాను పటిష్టం చేయడానికి వీలవుతుంది.

ఈ అత్యాధునిక టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే భవిష్యత్తులో ఈ ఏఐ పోలీస్ స్టేషన్ మోడల్‌ను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడంపై ప్రభుత్వం పరిశీలించనుంది.

 

RELATED ARTICLES

Most Popular