తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయా?.. సొంత పార్టీలోనే అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయా? …ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కొందరు మంత్రులు గుర్రుగా ఉన్నారన్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మొన్న కొండా సురేఖ.. నేడు దామోదర రాజనర్సింహ.. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు వంతు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తమకు అనుకూలంగా లేని మంత్రులను మీడియా కథనాల ద్వారా లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ సీనియర్ నేత లక్ష్మీకాంతరావు మధ్య ఢిల్లీలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న వివాదం తాజాగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం మీడియాకు లీక్ కావడం, సోషల్ మీడియాలో రేవంత్ అనుకూలంగా భావిస్తున్న కొందరు జర్నలిస్టులు పోస్టులు పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వివాదంలో రాజనర్సింహ మద్యం మత్తులో అసభ్య పదజాలంతో దూషించినట్లు కొన్ని మీడియా కథనాలు ప్రచురించాయి.ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే ఆడియోలు కూడా వైరల్ కావడంతో ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారని, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. జగ్గారెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడం, తనకు సంబంధించిన బిల్లులు విడుదల కాకపోవడం వంటి అంశాలు ఆయన ఆగ్రహానికి కారణమని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజనర్సింహకు సమాచారం ఇవ్వకుండానే ఆయన శాఖకు సంబంధించిన సమీక్షలు నిర్వహించారన్న వార్తలు కూడా వెలువడ్డాయి. లక్ష్మీకాంతరావుకు మద్దతుగా నిలుస్తూ, పార్టీ అధిష్ఠానం వద్ద రాజనర్సింహను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదే తరహాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రేవంత్ వైఖరిపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. వ్యవసాయ శాఖను తనకు అప్పగించి ఇబ్బందుల్లోకి నెట్టారని తుమ్మల పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు సాగునీరు, విద్యుత్ సరఫరా విషయంలో ఎదురవుతున్న సమస్యలు కూడా ఆయన అసహనానికి కారణమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా తుమ్మల కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని భూకబ్జా ఆరోపణలు ప్రచారంలోకి రావడం కలకలం రేపింది. రేవంత్‌కు సన్నిహితంగా ఉండే యూట్యూబ్ జర్నలిస్టు ద్వారా ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగానే మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య లేఖల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ నిర్వహించిన భారీ సభకు హాజరుకాలేదన్న కారణంతో ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాకూర్, విజయరమణారావులపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవద్దంటూ శ్రీధర్‌బాబుకు వంశీకృష్ణ వ్యంగ్యంగా లేఖ రాశారు.
గతంలో కాకా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేసినందుకు మహిళా ప్రజాప్రతినిధి, కాంగ్రెస్ కార్యకర్తలపై సస్పెన్షన్ వేటు వేసిన విషయాన్ని ఆయన తన లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పిల్లలకు మంచి చేసినందుకే చర్యలు తీసుకున్నట్లయితే, రాహుల్ గాంధీ సభకు హాజరుకాని శ్రీధర్‌బాబు, మక్కన్ సింగ్ ఠాకూర్, విజయరమణారావులపై కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ లేఖ కాంగ్రెస్‌లోని వర్గ విభేదాలను మరోసారి బయటపెట్టింది.
ఇక నల్గొండ జిల్లా రాజకీయాల్లోనూ కాంగ్రెస్‌కు అసమ్మతి సెగ తగులుతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం హుజూర్‌నగర్‌కే మంత్రా? లేక మొత్తం తెలంగాణకు మంత్రా? అంటూ ఆయన ప్రశ్నించారు. నిధులన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డే తీసుకెళ్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడం వల్లే ఇప్పుడు నీళ్లు నిల్వ ఉండి రైతులకు ఉపయోగపడుతున్నాయని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పటికీ తాము ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాదిరిగా నిధుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు మంత్రుల మధ్య అసంతృప్తి, మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య బహిరంగ విమర్శలు.. ఇంకోవైపు నిధుల కేటాయింపులపై వివాదాలు.. ఇలా తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారంలో ఉన్నా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య పొసగక..వీధిన పడుతుండటం రాజకీయ వర్గాల్లోనే కాదు కాంగ్రెస్ పార్టీ నేతలను అయోమయానికి గురి చేస్తోంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అసంతృప్తులను ఎలా చక్కదిద్దుతారు? పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుంటుందా? లేక ఈ వర్గపోరు మరింత ముదురుతుందా? అన్నదానికి కాలమే సమాధానం చెబుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

