HomeANDRA PRADESHCyclone Murasu:తీరం దాటిన మురసు..ఏపీ సీఎంకు అమిత్‌ షా ఫోన్

Cyclone Murasu:తీరం దాటిన మురసు..ఏపీ సీఎంకు అమిత్‌ షా ఫోన్

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన మురసు తుఫాన్ తీరం దాటింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం, జరిగిన నష్టం, చేపట్టిన సహాయక చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా… సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇటీవల అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే మురసు తుఫాన్ రావడంతో ఎదురైన పరిస్థితులను చంద్రబాబు… కేంద్ర మంత్రికి వివరించారు. వివిధ జిల్లాల్లో పంటలు, ఆస్తులకు జరిగిన నష్టం గురించి తెలియజేశారు. తుఫాన్ నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపినందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. వరుస తుఫాన్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని తగిన ఆర్థిక సాయంతో ఆదుకోవాలని కోరారు.

మరోవైపు మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు రాత్రంతా సమీక్షలు నిర్వహించారు. రాత్రి 10 గంటలకు అధికారులతో సమీక్షించిన ఆయన.. తెల్లవారుజామున 3.30 గంటలకు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మరోసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారుల సమాచారం ప్రకారం ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద అర్ధరాత్రి ఒంటిగంటకు తుఫాన్ తీరం తాకిందని తెలిపారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరా, సబ్‌స్టేషన్లు, విద్యుత్ స్తంభాల పరిస్థితిపై ప్రత్యేకంగా ఆరా తీశారు. బాపట్ల, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో కూలిన చెట్లను వెంటనే తొలగించినట్లు కలెక్టర్లు సీఎంకు వివరించారు.

మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో కొన్ని కుటుంబాలను ముందస్తుగా సురక్షిత శిబిరాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తుఫాన్ సహాయక చర్యలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్లు వెల్లడించారు. రాత్రంతా ప్రతి గంటకూ అధికారుల నుంచి పరిస్థితిని తెలుసుకుంటూ సహాయక చర్యలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular