స్టార్ త్రినేత్రం, వరంగల్: ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ పేరుతో యువతకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాటి అమలులో విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి వంటి హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కాకతీయ విశ్వవిద్యాలయంలో పర్యటించిన ఆయన విద్యార్థులు, నిరుద్యోగ యువతతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో యువత భవిష్యత్తుపై ఆశలు కల్పించిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెండేళ్లు గడుస్తున్నా రెండు లక్షల ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోవడం, వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు అనేక ఆర్థిక, సామాజిక సమస్యలు ఎదుర్కొంటున్నారని రాకేష్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లలకు కోచింగ్ ఇప్పిస్తున్నప్పటికీ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడంతో యువత భవిష్యత్తు అయోమయంలో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు నిరుద్యోగుల వయోపరిమితి దాటిపోతుంటే, మరోవైపు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి భరోసా లభించడం లేదన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ దయాదాక్షిణ్యం కాదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యతనిస్తూ లక్షలాది ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
యువతను కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు వేసే వారిగా చూడకూడదని, తెలంగాణ భవిష్యత్తును నిర్మించే శక్తిగా గుర్తించాలని అన్నారు. నిరుద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థుల పేరుతో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల సమస్యలపై గత మూడేళ్లుగా బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత తమ మద్దతును బీఆర్ఎస్కు ఇవ్వాలని కోరారు.
యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, ప్రతి హామీ ప్రస్తుత స్థితి, అమలు గడువును ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని, వారి హక్కుల సాధనకు ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, ఇన్ఛార్జి డాక్టర్ జెట్టి రాజేందర్, పార్టీ సీనియర్ నాయకులు కత్తెరపల్లి దామోదర్, డాక్టర్ బొల్లికొండ వీరేందర్, అర్బన్, రూరల్ జిల్లా కోఆర్డినేటర్లు డాక్టర్ అరూరి రంజిత్, లంక రాజగోపాల్, యూనివర్సిటీ నాయకులు కలకోట్ల సుమన్, కందికొండ తిరుపతి, పిన్నింటి విజయ్ కుమార్, పస్తం అనిల్, జాడి రవి, రాజశేఖర్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు


