స్టార్ త్రినేత్రం,సిరిసిల్ల: ప్రభుత్వ విద్యను కాపాడాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మరో కీలక ముందడుగు వేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గుర్తింపు రద్దు కాకుండా ఉండేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కాలేజీ గుర్తింపు ఫీజు రూ.1,30,800 చెల్లిస్తానని హామీ ఇచ్చారు.
ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గుర్తింపు కొనసాగాలంటే ప్రతి సంవత్సరం యూనివర్సిటీకి నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గత మూడేళ్లుగా ఈ ఫీజు చెల్లించకపోవడంతో రూ.1,30,800 బకాయి పేరుకుపోయింది. ఈ మొత్తాన్ని చెల్లించకపోతే కాలేజీ గుర్తింపు రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. దీంతో కాలేజీ పరిరక్షణ కమిటీ పలువురు దాతలను సంప్రదించినప్పటికీ ఆశించిన స్పందన లభించలేదు.
చివరకు సిరిసిల్ల టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మజీద్‌ను కాలేజీ ప్రతినిధులు సంప్రదించగా ఆయన ఈ సమస్యను టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన కవిత.. గుర్తింపు ఫీజు బకాయిని తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దీంతో కాలేజీ గుర్తింపు కొనసాగేందుకు మార్గం సుగమమైంది.
టీఆర్ఎస్ ప్రకటించిన పాంచజన్య సంకల్పంలోని ఐదు కీలక అంశాల్లో ఉచిత విద్యకు ప్రధాన ప్రాధాన్యత ఉందని మజీద్ తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలను కాపాడుకోవడం కోసం తమ వంతుగా అవసరమైన సహాయం అందిస్తామని కవిత పేర్కొన్నట్లు వెల్లడించారు.
ఎంతో పోరాటం చేసి సాధించుకున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గుర్తింపు రద్దు కాకుండా ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చిన కవితకు విద్యార్థులు, కళాశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. కవిత ఆర్థిక సాయం అందించనున్న విషయాన్ని విద్యార్థులు, సిబ్బందికి తెలియజేయడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అల్లె శంకర్, కదిరె రేణుక, మౌనిక, జావిద్, కదిరె భాస్కర్, శ్రీహరి, సాయి ప్రేమ్, సత్యం రెడ్డి, రాజేష్, హాజీ బాబా, భూపతి, అరుణ్ రెడ్డి, షబానా, మల్లవ్వ, దేవేంద్ర, పరుశరాములు, అంకుష్ తదితరులు పాల్గొన్నారు.


