HomeTELANGANATelangana: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణకు రావాలని ఆహ్వానం!

Telangana: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణకు రావాలని ఆహ్వానం!

📰 Generate e-Paper Clip

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు హాజరుకావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. ముఖ్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు రావాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహం, క్రీడారంగ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి ప్రధానితో చర్చించారు.

తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రముఖులను ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నారు.

అదేవిధంగా డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ క్రీడా కార్యక్రమానికి కూడా హాజరుకావాలని ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

ఈ సమావేశంలో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి కూడా సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో జరగనున్న రెండు కీలక కార్యక్రమాల నిర్వహణ, వాటికి సంబంధించిన ఏర్పాట్లు, కేంద్రం సహకారం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఒకవైపు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం మరోవైపు క్రీడారంగంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కార్యక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

RELATED ARTICLES

Most Popular