HomePOLITICALKavitha:అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి.. లేదంటే మేమే రెడ్ మార్క్ వేస్తాం..కవిత హెచ్చరిక

Kavitha:అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి.. లేదంటే మేమే రెడ్ మార్క్ వేస్తాం..కవిత హెచ్చరిక

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌లో భూములు, భవన నిర్మాణ అనుమతులు, టీడీఆర్ పేరుతో భారీగా అక్రమ దందాలు జరుగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ను అక్రమ సంపాదనకు కేంద్రంగా మార్చుకున్నారని విమర్శించారు. ముఖ్యంగా బంజారాహిల్స్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ, ఖానామెట్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖానామెట్‌లో సుమారు 500 నుంచి 700 వరకు అక్రమ భవనాలు నిర్మించారని, ప్రస్తుతం మరో 80 భవనాలు నిర్మాణంలో ఉన్నాయని కవిత ఆరోపించారు. నోటరీ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తూ పది అంతస్తుల వరకు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. రెండు భవనాల మధ్య అగరుబత్తి పట్టేంత స్థలం కూడా లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. అక్కడ కాలేజీలు, పీజీ హాస్టళ్లు నిర్వహిస్తున్నారని, ప్రతి భవనంలో సెల్లార్ కిచెన్లు ఉండటంతో అగ్నిప్రమాదం జరిగితే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అయ్యప్ప సొసైటీలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో భూదాన్ ఉద్యమ స్ఫూర్తితో 150 ఎకరాల భూమితో గురుకుల ట్రస్ట్ ఏర్పాటు చేసిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. ఆ భూములను కాపాడేందుకు గతంలో ట్రస్ట్ ఛైర్మన్ విఠల్ రావు పోరాటం చేశారని తెలిపారు. ఇప్పుడు అదే ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సర్వే నంబర్లు 11/18 నుంచి 44 వరకు, సర్వే నంబర్ 12లోనూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు లేనందున నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదని కవిత అన్నారు. ముఖ్యమంత్రి సోదరులే దగ్గరుండి బిల్డర్లకు అనుమతులు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఈ నిర్మాణాలపై ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులను కూడా భవన యజమానులు బెదిరిస్తున్నారని, తమ వెనుక ప్రభుత్వం ఉందని చెబుతున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తున్నామని, ఈలోగా అక్రమ భవనాలపై చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ తరఫున వెళ్లి రెడ్ మార్క్ వేస్తామని హెచ్చరించారు. ఖానామెట్‌లో సమగ్ర సర్వే నిర్వహించి అనుమతులు లేని భవనాలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని నిర్మాణాలు, అక్రమ అంతస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోటరీ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై రిజిస్ట్రేషన్ల శాఖ విచారణ చేపట్టాలని కోరారు. ప్రజలు అక్కడి భూములను కొనుగోలు చేసి ఇబ్బందులు పడవద్దని సూచించారు.

మరోవైపు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదని కవిత విమర్శించారు. రాష్ట్రంలోని 320 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని, కేంద్రం నుంచి సాయం వస్తుందని ఆశించామని అన్నారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి రాజకీయాలు మాట్లాడటానికే పరిమితమయ్యారని విమర్శించారు. దేశంలో 13 కోట్ల మంది విదేశీయులు ఉన్నారన్న అమిత్ షా వ్యాఖ్యలపైనా ప్రశ్నలు సంధించారు.

రైతుల సమస్యలపై మాట్లాడుతూ గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోకుండా రాష్ట్రంలో నీటి కొరత ఉందని ముఖ్యమంత్రి చెబుతున్నారని విమర్శించారు. పంటలు వేయవద్దని సీఎం చెబుతున్నారంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భిన్నంగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వంలో సమన్వయం లేదని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో నమోదు చేసుకుని తమ పార్టీకి మద్దతుగా నిలవాలని కవిత పిలుపునిచ్చారు. మహిళల కోసం మహిళలే నడిపిస్తున్న పార్టీగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular