HomeSPORTSఐపీఎల్‌పై లలిత్ మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

ఐపీఎల్‌పై లలిత్ మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

📰 Generate e-Paper Clip

ఐపీఎల్‌ పై మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ కీలక ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం ఏప్రిల్‌-మే నెలల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్‌ను జనవరి నుంచి ప్రారంభించేలా మార్పులు చేయాలని సూచించారు. అంతేకాకుండా టోర్నీలో మ్యాచ్‌ల సంఖ్యను 94కు పెంచాలని అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనపై ఐసీసీ చైర్మన్ జై షా చొరవ తీసుకుని అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లో అవసరమైన మార్పులకు సహకరించాలని కోరారు.

జనవరిలో టోర్నీని ప్రారంభించడం కూడా ఈ ప్రతిపాదనలో భాగమేనని వివరించారు. అయితే ఏడు నెలల పాటు నిరంతరాయంగా ఐపీఎల్ నిర్వహించాలని తాను కోరడం లేదని స్పష్టం చేశారు.2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఎనిమిది జట్లు…59 మ్యాచ్‌లతో టోర్నీ జరిగిందని మోదీ గుర్తుచేశారు. ప్రస్తుతం జట్ల సంఖ్య పదికి పెరిగిందని అలాగే ప్రతి జట్టు మిగతా జట్లతో స్వదేశంలో, ప్రత్యర్థి మైదానంలో ఆడే పూర్తి లీగ్ విధానాన్ని అమలు చేస్తే 90 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు కలిపి మొత్తం 94 మ్యాచ్‌లు అవుతాయని వివరించారు. ఇది తొలి సీజన్‌తో పోలిస్తే 35 మ్యాచ్‌లు ఎక్కువని దాదాపు 60 శాతం పెరుగుదల అని తెలిపారు.

ఇన్ని మ్యాచ్‌లను కేవలం రెండు నెలల వ్యవధిలో నిర్వహించడం ఆటగాళ్లు, ప్రేక్షకులు, నిర్వాహకులపై ఒత్తిడిని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌ను ఆదరించడానికి వేసవి సెలవులే కారణం కాదని తమ అభిమాన జట్లు, ఆటగాళ్లు, ఉత్కంఠభరితమైన క్రికెట్‌ కూడా ప్రధాన కారణాలని పేర్కొన్నారు.

బీసీసీఐకి ఐపీఎల్ ప్రధాన ఆదాయ వనరుగా ఉందని భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ మీడియా హక్కుల ఆదాయంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఐపీఎల్ విస్తరణతో వచ్చే ఆదాయం, అంతర్జాతీయ క్రికెట్ ద్వారా వచ్చే ఆదాయం, ఇతర బోర్డుల ప్రయోజనాలను సమగ్రంగా పరిశీలించాలని అన్నారు.

ఏప్రిల్‌-మే నెలల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని… రాత్రి మ్యాచ్‌లు నిర్వహించినప్పటికీ వేడి, ఉక్కపోత ప్రభావం తగ్గదని మోదీ పేర్కొన్నారు. ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందే సాధన చేయాల్సి ఉంటుందని…ప్రేక్షకులు ప్రయాణాలు చేసి స్టేడియాలకు చేరుకోవాల్సి ఉంటుందని గుర్తుచేశారు. గ్రౌండ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, ప్రసార బృందాలు కూడా గంటల తరబడి ఎండలో పనిచేయాల్సి వస్తుందని చెప్పారు. ఫుట్‌బాల్ లీగ్‌లతో ఐపీఎల్‌ను పోల్చిన ఆయన.. సుదీర్ఘ సీజన్ ద్వారా అభిమానులు తమ జట్టును నిరంతరం అనుసరించే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే క్రికెట్ మ్యాచ్‌లు దాదాపు నాలుగు గంటల పాటు సాగుతాయని, అందువల్ల మ్యాచ్‌ల మధ్య తగిన విరామం, ముగింపు సమయాలపై కూడా శ్రద్ధ పెట్టాలని సూచించారు.

 

RELATED ARTICLES

Most Popular