Babapur Village: ప్రస్తుతం విద్యారంగంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల హవా కొనసాగుతున్న వేళ తెలంగాణలోని ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమ పిల్లల భవిష్యత్తు కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రైవేట్ పాఠశాలల వైపు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో, నిర్మల్ జిల్లాలోని ఒక గ్రామం మాత్రం ప్రభుత్వ పాఠశాలలకే పూర్తి మద్దతు ప్రకటించి ఆదర్శంగా నిలిచింది. ప్రైవేట్ పాఠశాలల్లో చదివితేనే మంచి విద్య లభిస్తుందనే భావనను పక్కనబెట్టి, ప్రభుత్వ బడుల్లో అందుతున్న సౌకర్యాలు, నాణ్యమైన బోధనపై విశ్వాసం ఉంచుతూ గ్రామస్తులంతా ఏకగ్రీవంగా కీలక తీర్మానం చేశారు.
నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలంలోని బాబాపూర్ గ్రామంలో జరిగిన ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గ్రామ సర్పంచ్ పడిగెల లక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సమావేశంలో గ్రామ ప్రజలంతా పాల్గొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని నిర్ణయించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంగ్లీష్ మాధ్యమ బోధన, మధ్యాహ్న భోజన పథకం, ఆట స్థలాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయుల సేవలు వంటి అంశాలను గ్రామస్తులకు వివరించడంతో ఈ నిర్ణయానికి మరింత బలం చేకూరింది.
గ్రామంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులు కూడా రాకూడదని గ్రామస్తులు స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే ముందుగా ప్రజల్లోనే మార్పు రావాలని, తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించడం ద్వారా ఆ మార్పుకు శ్రీకారం చుట్టాలని గ్రామ పెద్దలు సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదివించేందుకు తల్లిదండ్రులు చెల్లిస్తున్న భారీ ఫీజులు కుటుంబాలపై ఆర్థిక భారం పెంచుతున్నాయని, అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఉచితంగా లభిస్తున్నదని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. గ్రామానికి చెందిన విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తే సంబంధిత తల్లిదండ్రులపై జరిమానా విధించే అంశాన్ని కూడా గ్రామస్థులు సమర్థించారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలంటే అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, ఒకరి నిర్ణయం వల్ల గ్రామ తీర్మానం బలహీనపడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సర్పంచ్ పడిగెల లక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా విద్యా ప్రమాణాలు పెరిగాయని, తల్లిదండ్రులు అపోహలను వీడి ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచుకోవాలని కోరారు. పిల్లల భవిష్యత్తు కోసం అవసరం లేని ఆర్థిక భారం మోసే బదులు, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
గ్రామస్తులంతా ఒకే వేదికపై నిలబడి ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపిస్తామని ప్రతిజ్ఞ చేయడం విశేషంగా మారింది. విద్యా రంగంలో ప్రభుత్వ బడుల పట్ల విశ్వాసాన్ని పెంచేందుకు బాబాపూర్ గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా ఎంత ముఖ్యమో ఈ గ్రామం మరోసారి నిరూపించింది.

