HomeరాజకీయంTelangana Congress: జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలా?

Telangana Congress: జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలా?

📰 Generate e-Paper Clip

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ పాత చర్చలు కొత్త ఊపుతో ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి వ్యవహారాలు సవ్యంగా నడుస్తున్నాయనే భావన నెలకొన్న సమయంలోనే, పీసీసీ అధ్యక్ష పదవిపై వచ్చిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే పీసీసీ బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతున్న నేపథ్యంలో, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిను పీసీసీ చీఫ్‌గా చేస్తే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తుందన్న వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి.

2023 అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రేవంత్ రెడ్డికు పార్టీ అధిష్టానం పగ్గాలు అప్పగించగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అనంతరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత కోమటిరెడ్డి కేబినెట్‌లో చోటు దక్కించుకోవడం వంటి పరిణామాలతో పరిస్థితి సర్దుకుపోయినట్లు కనిపించింది. అదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి విజయాలు అందించడం ద్వారా తన సామర్థ్యాన్ని చాటుకున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లోనే కేబినెట్ విస్తరణపై వస్తున్న ఊహాగానాలు ఈ చర్చకు కొత్త కోణాన్ని తెచ్చాయి. మహేష్ కుమార్ గౌడ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటే పీసీసీ పదవిలో మార్పు అనివార్యమవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్‌గా చూడాలన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జగ్గారెడ్డి మాస్ లీడర్‌గా ప్రజల్లో బలమైన గుర్తింపు కలిగి ఉండటం, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన దూకుడు, ప్రతిపక్షాలపై ఘాటైన స్పందన ఇవన్నీ కలిసి ఆయనకు ఆ బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి లాభం ఉంటుందన్న అభిప్రాయం కొంతమంది నాయకుల్లో వ్యక్తమవుతోంది.

అయితే ఈ వ్యాఖ్యలను పార్టీ అంతర్గత రాజకీయాల కోణంలోనే చూడాలా, లేక వ్యక్తిగత అభిప్రాయంగా తీసుకోవాలా అన్నదానిపై చర్చ సాగుతోంది. జగ్గారెడ్డి గతంలో కోమటిరెడ్డికి బహిరంగంగా మద్దతు తెలపడం, ఆయనపై వచ్చిన విమర్శలకు ముందుండి సమాధానం చెప్పడం వంటి పరిణామాల నేపథ్యంలో, కోమటిరెడ్డి వ్యాఖ్యల్లో వ్యక్తిగత అభిమానం కూడా ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ వ్యాఖ్యలకు అతిగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

ఇక సామాజిక సమీకరణాల కోణంలో చూస్తే.. ఇప్పటికే ముఖ్యమంత్రి స్థానంలో రెడ్డి వర్గానికి చెందిన నాయకుడు ఉండటం వల్ల, పీసీసీ అధ్యక్ష పదవిని కూడా అదే వర్గానికి ఇవ్వడం సాధ్యంకాదనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సమతుల్యతను కాపాడేందుకు వర్గాల మధ్య సమన్వయం అవసరమని, అందువల్ల పెద్ద మార్పులు త్వరలో జరిగే అవకాశాలు తక్కువనే అభిప్రాయం బలపడుతోంది.

మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ అంతర్గత చర్చలకు దారి తీసినప్పటికీ, వాటి వెనుక పెద్ద రాజకీయ మార్పుల సంకేతాలు ఉన్నాయా లేదా అన్నది ఇప్పటికీ స్పష్టంగా కనిపించడం లేదు. కేబినెట్ విస్తరణ జరిగితేనే పరిస్థితులు మారే అవకాశం ఉందని, లేదంటే ప్రస్తుత వ్యవస్థ కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఈ చర్చలు ఎటువైపు దారితీస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.

ALSO READ: Pawan Kalyan: జనసేనలో అసలు ఏం జరుగుతోంది?.. వివాదాస్పదంగా ఆవిర్భావ వేడుకలు

RELATED ARTICLES

Most Popular