* రైతుబంధు హామీలపై కేటీఆర్ ఫైర్
* మహాలక్ష్మి పథకం పేరుతో మోసం
* బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి గుర్తు చేసిన కేటీఆర్
* మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని పిలుపు
* కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
* ఢిల్లీకి మూటలు మోస్తున్నారన్న విమర్శ
* రెండోసారి మోసపోవద్దని ప్రజలకు సూచన
* రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌కు మద్దతు కోరిన కేటీఆర్
KTR: రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా పూర్తిగా కుదేలవుతుందని, రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమాగా ప్రకటించారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి ఇప్పటికే ఒకసారి మోసపోయిన ప్రజలు మరోసారి అదే తప్పు చేయవద్దని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్తు భద్రమై ఉండాలంటే, రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో నడవాలంటే, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీది అభయ హస్తం కాదని, ప్రజలను కాల్చేసే భస్మాసుర హస్తమని తీవ్ర పదజాలంతో విమర్శించారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ మరింత ఆగమైపోతుందని హెచ్చరించారు.

మహాలక్ష్మి పథకం పేరుతో రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డలను మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. సోనియాగాంధీ మీద ఒట్టు వేసి రైతుబంధు కింద రూ.10 వేలకు బదులు రూ.15 వేలు ఇస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి, ఆ హామీని గాలికొదిలేశారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో డిసెంబర్ నెలలోనే రైతుబంధు రైతుల ఖాతాల్లో జమయ్యేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఫిబ్రవరి వచ్చినా రైతులకు పైసా కూడా అందలేదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం రైతుల సంక్షేమం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నేతలను స్టువర్టుపురం దొంగలతో పోల్చిన కేటీఆర్.. మరోసారి వాళ్లను నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. తప్పుడు ఓటు వేస్తే ఐదేళ్లపాటు శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, ఆగమైతే గోసపడాల్సిందేనని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూరు, వరంగల్ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రేవంత్‌రెడ్డి రెండేళ్లుగా సంపాదించుకున్న సొమ్మును కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు మోస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి మళ్లీ ఓటు వేయిస్తానని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు మళ్లీ ఇళ్లకు వచ్చి మాయ మాటలు, కల్లబొల్లి హామీలు ఇస్తారని, వాటిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. వాళ్లు ఇచ్చిన డబ్బు తీసుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అవుతుందని, చివరికి ప్రజలే నష్టపోతారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో వ్యాపారాలు కుదేలయ్యాయని, రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారిందని, ఇది కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ తల్లి నెత్తినున్న బంగారాన్ని ఎత్తుకుపోయారని విమర్శించారు. చేతిలో బతుకమ్మను మాయం చేసి హస్తం గుర్తు పెట్టారని వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్ వాళ్లది అభయ హస్తం కాదని మరోసారి భస్మాసుర హస్తమేనని అన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరు మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్ నిధులు తెచ్చి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేశారని చెప్పారు. జిల్లా కేంద్రంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలను నర్సంపేటలో ఏర్పాటు చేయడం బీఆర్‌ఎస్ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని అన్నారు. గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నర్సంపేటలో ఇంటింటికీ గ్యాస్ పైపు కనెక్షన్లు అందించామని, అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఏమిటో ప్రజలు మరోసారి గుర్తు చేసుకుని బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ALSO READ: నిద్ర ఎక్కువైతే వచ్చే సమస్యలివే!

