Telangana: సెలవులు రద్దు.. అధికారులు ఫీల్డ్‌లోనే ఉండాలి

Telangana: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అప్రమత్తం చేశారు. వర్షాలు, వరదల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పైస్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి ఇంజనీర్ల వరకు ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.

భారీ వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శని, ఆదివారాలు అనే తేడా లేకుండా అధికారులు అందరూ ఫీల్డ్‌లోనే అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ విధులకు దూరంగా ఉండరాదని, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా వర్షాలు, వరదల ప్రభావానికి ముందుగా గురయ్యే రహదారులు, వంతెనలు, కల్వర్టుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.

ప్రజా రవాణా వ్యవస్థకు అంతరాయం కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. వరదల కారణంగా రహదారులు దెబ్బతిన్నా లేదా కోతకు గురైనా వెంటనే తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి రాకపోకలు సజావుగా కొనసాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రమాద సూచనలు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలని కూడా సూచించారు.

భారీ వర్షాల పరిస్థితుల్లో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్న మంత్రి, రెవెన్యూ, పోలీసు, విద్యుత్, సాగునీటి శాఖలతో ఆర్ అండ్ బి అధికారులు నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కేంద్రం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సూచనలు జారీ చేయాలని పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రంలోని అన్ని ఆర్ అండ్ బి డివిజన్ల నుంచి వర్షాల ప్రభావం, రహదారుల పరిస్థితి, చేపడుతున్న చర్యలకు సంబంధించిన వివరాలను నిరంతరం తనకు నివేదించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాఖ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ALSO READ: Actress Mouni Roy: నేను గే కాదు..

Last Updated on June 14, 2026 · 11:23 AM by DHEEKONDA SHIVAKRISHNA

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles