Telangana: నాన్‌వెజ్ ఆహారాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదించే వారికి ఇది పెద్ద షాక్‌గా మారే పరిణామం. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చికెన్ దుకాణాలు నిరవధికంగా బంద్ కానున్నట్లు చికెన్ షాపుల యజమానుల సంఘం ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ మహానగరాన్ని కలుపుకొని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ బంద్ ప్రభావం కనిపించనుంది. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇస్తున్న కమీషన్ మార్జిన్‌ను తీవ్రంగా తగ్గించడం వల్ల భారీ నష్టాలు ఎదుర్కొంటున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు లభించిన మార్జిన్‌ను ప్రస్తుతం రూ.8 నుంచి రూ.10కు కుదించడం వల్ల వ్యాపారం నిర్వహించడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. ఇప్పటికే పలు హోటళ్లు, బల్క్‌గా కొనుగోలు చేసే వ్యాపారులతో పాత ధరలకే ఒప్పందాలు చేసుకున్నామని, అకస్మాత్తుగా మార్జిన్ తగ్గిపోవడం వల్ల నష్టాలు పెరుగుతున్నాయని వివరించారు.
ఇక చికెన్ ధరల పెరుగుదల కూడా వ్యాపారులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. గతంలో హోల్‌సేల్ మార్కెట్లో లైవ్ చికెన్ ధర రూ.120 నుంచి రూ.130 మధ్య ఉండగా, ప్రస్తుతం అది రూ.180 నుంచి రూ.190కు పెరిగిందని యజమానులు పేర్కొన్నారు. ఒక కిలో చికెన్‌లో సుమారు 100 గ్రాములు వృథా కావడంతో రూ.15 వరకు నష్టం వస్తోందని, అదనంగా ఇతర ఖర్చులు రూ.18 వరకు చేరుతాయని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు లాభం లేకపోగా, జేబు నుంచి డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంఘ ప్రతినిధులు వాపోతున్నారు. ఈ సమస్యలపై పౌల్ట్రీ కంపెనీలు వెంటనే స్పందించి మార్జిన్‌ను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టాలని సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని చికెన్ దుకాణాల యజమానులు ఈ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పౌల్ట్రీ కంపెనీలు తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించే వరకు ఈ నిరసన కొనసాగుతుందని, దుకాణాలు తెరవబోమని స్పష్టం చేశారు. సంఘ నిర్ణయాన్ని విరుద్ధంగా వ్యవహరించి దుకాణాలు తెరిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులు కూడా ఈ బంద్‌కు సహకరించాలని కోరుతూ యజమానులు విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు భారీగా పెరిగి వినియోగదారులను ఇబ్బందులకు గురి చేశాయి. ఎండల తీవ్రత పెరగడం, కోళ్లు చనిపోవడం, సరఫరా తగ్గిపోవడం వంటి కారణాలతో కిలో చికెన్ ధర రూ.300 దాటింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇది రూ.350 నుంచి రూ.400 వరకు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల కొంతమేర ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో గుడ్ల ధరలు తగ్గడం గమనార్హం. ప్రస్తుతం ఒక కేసు గుడ్లు రూ.132 నుంచి రూ.140 మధ్య విక్రయమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చికెన్ దుకాణాల బంద్ ప్రభావం మార్కెట్‌పై మరింతగా పడే అవకాశముందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
ALSO READ: Cicada: మరోసారి కోవిడ్ ముప్పు..?
Last Updated on March 31, 2026 · 10:41 PM by Star Trinethram



