Siberian Husky: విదేశీ జాతి కుక్కలకు ‘దేశీ’ కష్టాలు..!

Siberian Husky: సంగారెడ్డి జిల్లాలో ఖరీదైన విదేశీ జాతికి చెందిన సైబీరియన్ హస్కీ కుక్కలను నడిరోడ్డుపై వదిలిపెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పెంపుడు జంతువులను ఫ్యాషన్‌, ప్రతిష్ఠ కోసం కొనుగోలు చేసి, తర్వాత వాటిని సంరక్షించలేక వీధుల్లో వదిలేస్తున్న ఘటనలు పెరుగుతున్న వేళ ఈ సంఘటన జంతు ప్రేమికుల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది. నందిగామ గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న సైబీరియన్ హస్కీ కుక్కలపై సమాచారం అందుకున్న బీడీఎల్ భానూరు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలు, వాహనాల కదలికలను క్షుణ్ణంగా పరిశీలించి చివరకు ఈ ఘటనకు బాధ్యులైన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో ఫతేనగర్‌కు చెందిన సత్యనారాయణ, హనుమాన్‌పేటకు చెందిన సుధీర్ బాబు, కొల్లూరు గ్రామానికి చెందిన సుందర్ సింగ్, రామ్ నరేష్ నగర్‌కు చెందిన ఎస్.ఏ.సత్యనారాయణ కలిసి ఈ సైబీరియన్ హస్కీ కుక్కలను సంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామ శివారులో వదిలిపెట్టినట్లు తేలింది. పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మియాపూర్‌లోని కల్వరి టెంపుల్ సమీపంలో నిందితులు ఉపయోగించిన వాహనాన్ని గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా సంచలన విషయాలు బయటపడ్డాయి.

విచారణలో నిందితులు తమ వద్ద ఉన్న స్థలం సరిపోకపోవడం, కుక్కల వయసు పెరగడంతో వాటిని చూసుకోవడం భారంగా మారిందని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో వాటిని గ్రామ శివారులో వదిలిపెట్టినట్లు తెలిపినట్టు సమాచారం. అయితే పెంపుడు జంతువులను ఇలా అనాథలుగా వదిలేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు స్పష్టం చేశారు. యజమానులు తమ పెంపుడు జంతువులను పూర్తి బాధ్యతతో చూసుకోవాలని హెచ్చరించారు. రోడ్లపై వదిలేయడం వల్ల ప్రజలకు ప్రమాదం ఏర్పడటమే కాకుండా, జంతువుల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

ఈ కేసులో మరో కీలక అంశంపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ కుక్కల నిర్వహణలో మియాపూర్ కల్వరి టెంపుల్‌కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జంతువుల సంరక్షణకు అవసరమైన లైసెన్స్‌లు, అనుమతులు తీసుకున్నారా లేదా అనే అంశంపై పూర్తి వివరాలు అందించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ జీహెచ్‌ఎంసీ అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. జంతువుల సంరక్షణలో నిబంధనలు పాటించారా అనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇక ఈ ఘటనపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబీరియన్ హస్కీ వంటి విదేశీ జాతి కుక్కలకు ప్రత్యేక వాతావరణం, అధిక ఖర్చుతో కూడిన ఆహారం, ప్రత్యేక సంరక్షణ అవసరం ఉంటుందని వారు గుర్తుచేస్తున్నారు. మంచు ప్రాంతాలకు చెందిన ఈ జాతి కుక్కలను కేవలం ప్రతిష్ఠ కోసం కొనుగోలు చేసి, తర్వాత భారంగా భావించి రోడ్లపై వదిలేయడం దారుణమని విమర్శిస్తున్నారు. సరైన అవగాహన లేకుండా ఇలాంటి జంతువులను కొనుగోలు చేయడం వల్ల చివరికి అవే బాధపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో జంతు హింస నిరోధక చట్టం కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు చర్యలు ప్రారంభించారు. పెంపుడు జంతువులను కొనుగోలు చేసే ముందు వాటి సంరక్షణ, ఆహారం, వాతావరణ అవసరాలపై పూర్తి అవగాహన ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: Roopa Muggalla: మరీ ఇంత అందమా!.. సినిమా హీరోయిన్స్ చూస్తే ఎంత కుళ్లుకుంటారో..?

Last Updated on May 8, 2026 · 9:00 AM by Sandeep Kumar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,000FansLike
10FollowersFollow
160SubscribersSubscribe

Latest Articles