మనుషులు మాత్రమే కాదు, మూగజీవాలు కూడా కుటుంబంలో భాగమవుతాయని నిరూపించే ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా కుటుంబంతో కలిసి జీవించిన పెంపుడు కుక్క మృతి చెందడంతో ఓ కుటుంబం కన్నీటి వీడ్కోలు పలికింది.
చిట్యాల మండలం బొంగోని చెరువు గ్రామానికి చెందిన రైతు సామిడి మహేందర్ రెడ్డి పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తన ఇంట్లో పెంచుకున్న కాలభైరవ అనే కుక్కను కూడా కుటుంబ సభ్యుడిలా భావించి పెంచుకున్నారు.
కాలభైరవ కుటుంబ సభ్యుల వెంట ఎల్లప్పుడూ ఉండేది. ఇంటి పనుల నుంచి వ్యవసాయ క్షేత్రం వరకు మహేందర్ రెడ్డికి తోడుగా ఉండేది. దీంతో ఆ శునకంతో కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.
అయితే ఇటీవల జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ ఢీకొనడంతో కాలభైరవ మృతి చెందింది. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమ ఇంట్లో ఒక సభ్యుడిని కోల్పోయిన భావనతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
కాలభైరవ మృతదేహానికి పూలమాలలు వేసి ప్రత్యేక వాహనంలో గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, గ్రామస్తులు కూడా పాల్గొని నివాళులర్పించారు.
అంత్యక్రియలతోనే ఆగకుండా మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. కాలభైరవ తమ జీవితాల్లో విడదీయరాని భాగమని మహేందర్ రెడ్డి కుటుంబం భావోద్వేగంగా తెలిపింది.
ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారగా, మనుషులు మరియు జంతువుల మధ్య ఉండే ప్రేమ, అనుబంధానికి ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.
Last Updated on June 2, 2026 · 9:25 AM by DHEEKONDA SHIVAKRISHNA



