స్టార్ త్రినేత్రం, సిద్ధిపేట: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు అత్యంత ప్రభావవంతమైన సాధనంగా మారుతున్నాయని తొగుట సీఐ లతీఫ్ స్పష్టం చేశారు. శనివారం కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్‌తో కలిసి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామాల్లో భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సీసీ కెమెరాల అవసరం, వాటి ఉపయోగాలపై వివరంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఐ లతీఫ్ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని అన్నారు. ప్రతి గ్రామంలో ముఖ్య కూడళ్లు, రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలపై నిరంతర నిఘా సాధ్యమవుతుందని, అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టవచ్చని వివరించారు. ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను తక్కువ సమయంలో గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఈ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ భద్రత కోసం సహకరించాలని కోరారు.
డిజిటల్ యుగంలో పోలీసింగ్ విధానం కూడా ఆధునికంగా మారుతోందని, సీసీ కెమెరాల సహకారంతో నేరస్తుల్లో భయం ఏర్పడుతుందని సీఐ పేర్కొన్నారు. గ్రామాల్లో శాంతి భద్రతలు పరిరక్షించడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, పోలీస్ శాఖతో కలిసి గ్రామస్తులు అడుగులు వేస్తే నేరాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడ్డారు.
అనంతరం ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్థులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం మూడు సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించగా, మరో కెమెరా కోసం ఏలు రామ్‌రెడ్డి సహాయం అందించారని తెలిపారు. గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, దాతలు కలిసి మొత్తం రూ.1,05,000 విరాళంగా అందించేందుకు ముందుకు రావడం గ్రామ భద్రతపై ఉన్న చైతన్యాన్ని చాటుతోందని చెప్పారు.
ఈ సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యతను గ్రామ పోలీస్ అధికారి నరేందర్‌తో పాటు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపడతారని ఎస్ఐ శ్రీనివాస్ వెల్లడించారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షణ చేపట్టి, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేసి గ్రామాన్ని సురక్షితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ALSO READ: అండర్-19 ప్రపంచకప్ విజేతలకు BCCI భారీ బహుమతి
Last Updated on February 7, 2026 · 11:30 PM by Star Trinethram



