Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

Medaram: గద్దెపైకి సమ్మక్క

Author
Posted By STAR TRINETHRAM
| 29 Jan 2026, 04:31 PM | Devotional
Medaram: గద్దెపైకి సమ్మక్క

వనం నుంచి జనంలోకి సమ్మక్క

భారీ భద్రత మధ్య గద్దెల పైకి సమ్మక్క ఆగమనం

అమ్మ రాకతో ప్రశాంతంగా తన్మయత్వంతో మేడారం

సమ్మక్క ఆగమనంతో ఊపందుకున్న జాతర

మేడారం మహా జాతరలో భక్తులంతా ఉత్కంఠగా ఎదురుచూసిన అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వనదేవత సమ్మక్క తల్లి అడవిని విడిచి భక్తజన సమూహంలోకి అడుగుపెట్టడంతో మేడారం ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో మార్మోగింది. అడవుల మధ్య కోట్లాదిగా తరలివచ్చిన భక్తులు జయజయధ్వానాలు పలుకుతూ అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. సమ్మక్క ఆగమనంతో మేడారం పరిసరాలు ఒక్కసారిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

చిలుకల గుట్టపై నుంచి సమ్మక్కను పూజారులు కిందికి తీసుకువచ్చిన క్షణం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. అమ్మవారి రాకకు సూచికగా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతం పలికారు. ఈ సంఘటనతో మేడారం అడవులు మారుమోగిపోయాయి. భక్తుల హర్షధ్వానాలు, డప్పుల మ్రోగుడు జాతర వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి.

సమ్మక్కను గద్దెల మీదికి తీసుకెళ్లే సమయంలో భక్తుల్లో అపూర్వమైన భావోద్వేగం వ్యక్తమైంది. సుమారు 260 మంది రోప్ పార్టీ సిబ్బంది, మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో అధికార లాంఛనాలతో అమ్మవారి ఊరేగింపు సాగింది. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు సరిగ్గా సమ్మక్క మేడారం గద్దెలపైకి చేరుకోవడంతో ఆ ఘడియలు భక్తులకు చిరస్మరణీయంగా మారాయి.

ఇవి కూడా చదవండి

దారి పొడవునా శివసత్తుల పూనకాలు, తన్మయత్వంతో ఊగిపోయిన భక్తుల దృశ్యాలు ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని రగిలించాయి. అమ్మవారికి ఎదుర్కొళ్లతో స్వాగతం పలుకుతూ, పసుపు కుంకుమ నీళ్లతో నీరాజనాలు సమర్పిస్తూ భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఈ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరికీ ఒళ్ళు గగుర్పాటుకు గురయ్యేలా చేశాయి.

భారీ భద్రత నడుమ సమ్మక్క గద్దెల ప్రాంతానికి చేరుకుంది. అమ్మవారి రాకకు ముందు గద్దెలపై కంక వనాన్ని ప్రతిష్టించి సంప్రదాయ పూజలు నిర్వహించారు. అనంతరం కొమ్ము నృత్యాలు, గుస్సాడీ, ధింసా నృత్యాలతో అమ్మవారిని గద్దెల వద్దకు తీసుకువచ్చారు. గిరిజన సంప్రదాయాలకు అద్దం పడేలా ఈ కార్యక్రమాలు సాగాయి.

గద్దెల వద్దకు చేరుకున్న సమ్మక్క తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన పూజారి సారయ్య మహా ఘట్టాన్ని పూర్తి చేయగా, అనంతరం మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు అమ్మవారికి పూజలు సమర్పించారు. ఆ తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వడంతో మేడారం పరిసరాలు భక్తుల సందడితో నిండిపోయాయి.

అమ్మవారి ఆగమనంతో మేడారం ఒక్కసారిగా ప్రశాంతతను సంతరించుకుంది. లక్షలాది మంది జనసందోహం మధ్య కూడా ఒక ఆధ్యాత్మిక నిశ్శబ్దం అలుముకుంది. భక్తులు అమ్మవారి దర్శనంతో తన్మయత్వానికి లోనై మొక్కులు చెల్లించుకుంటూ భక్తిశ్రద్ధలు వ్యక్తం చేస్తున్నారు.

సమ్మక్క గద్దెలపై ప్రతిష్టతో మేడారం మహా జాతర మరింత ఊపందుకుంది. ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి నీరాజనాలు పలికారు. రేపు దర్శనం అనంతరం, ఎల్లుండి సమ్మక్క మరియు సారలమ్మలు తిరిగి వన ప్రవేశం చేయనున్న నేపథ్యంలో జాతర మరో కీలక దశకు చేరుకుంది.

ALSO READ: History: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక ‘మేడారం’

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: