Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ట్రెక్కింగ్‌కు వెళ్లి అదృశ్యమైన 24 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని బబితా పాండే కోసం అధికారులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించగా, బబితా ఆచూకీ కోసం సైన్యం నుంచి విపత్తు నిర్వహణ బృందాల వరకు అనేక విభాగాలు రంగంలోకి దిగాయి. దట్టమైన అటవీ ప్రాంతాలు, లోయలు, గుహలు, ట్రెక్కింగ్ మార్గాలను జల్లెడ పట్టినా ఇప్పటివరకు ఆమె జాడ మాత్రం లభించలేదు.
నైనిటాల్‌కు చెందిన బబితా పాండే తన ఇద్దరు స్నేహితులు హర్మన్‌పాల్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్‌లతో కలిసి ఉత్తరకాశీ పర్యటనకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. మే 25న డెహ్రాడూన్ చేరుకున్న ఈ ముగ్గురు, అనంతరం హర్సిల్, గంగోత్రి సహా పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. పర్యటనలో భాగంగా మే 28న రైతల్ గ్రామానికి చేరుకుని అక్కడ రాత్రి బస చేసిన తర్వాత, మరుసటి రోజు ప్రసిద్ధ దయారా బుగ్యాల్ ట్రెక్కింగ్ మార్గంలో ప్రయాణం ప్రారంభించారు.
ట్రెక్కింగ్ సందర్భంగా గోయి బేస్ క్యాంప్‌లో బస చేసిన సమయంలో అర్ధరాత్రి తర్వాత బబితా పాండే కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఉదయం వరకు ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆందోళన చెందగా, అనంతరం విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలను ప్రారంభించారు.
ఉత్తరకాశీ జిల్లా పోలీసు అధికారి కమలేష్ ఉపాధ్యాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. బబితా కోసం సుమారు 150 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలు అన్వేషణ కొనసాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ బలగాలు, రాష్ట్ర విపత్తు స్పందన దళం, జాతీయ విపత్తు స్పందన దళం, అటవీ శాఖ, విపత్తు నిర్వహణ విభాగాల సిబ్బంది పాల్గొంటున్నారు. కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో కూడా జాగిలాల సహాయంతో గాలింపు చేపట్టగా, డ్రోన్ల ద్వారా గగనతల పరిశీలన కూడా నిర్వహిస్తున్నారు. గోయి క్యాంప్ సమీపంలోని సరస్సులో ప్రత్యేక డైవింగ్ బృందం సైతం అన్వేషణ చేపట్టింది.
మరోవైపు బబితాతో కలిసి వెళ్లిన ఇద్దరు స్నేహితులను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తూ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ట్రెక్కింగ్ ఏర్పాట్లు చేసిన ‘ప్రో మౌంటెన్’ అనే సంస్థపై కూడా అధికారుల దృష్టి పడింది.
ప్రాథమిక విచారణలో బబితా పాండే లేదా ఆమెతో పాటు వెళ్లిన వారి పేర్లపై అధికారిక పర్యాటక పోర్టల్‌లో చెల్లుబాటు అయ్యే డిజిటల్ పర్మిట్లు నమోదు కాలేదని తేలినట్లు జిల్లా పర్యాటక శాఖ వెల్లడించింది. దీంతో నకిలీ పర్మిట్ ఆధారంగా ట్రెక్కింగ్‌కు అనుమతి కల్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ప్రో మౌంటెన్’ ట్రెక్కింగ్ ఏజెన్సీ రిజిస్ట్రేషన్‌ను అధికారులు తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.
అయితే బబితా పాండే అదృశ్యమవడం వెనుక గల కారణాలపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ప్రమాదవశాత్తు లోయలో పడిపోయిందా, అడవిలో దారి తప్పిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే అంశాలపై అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. బబితా ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని, ఆమెను క్షేమంగా గుర్తించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
ALSO READ: Numerology: లక్కీ బర్త్ డేట్ ఇదే..!
Last Updated on June 4, 2026 · 2:17 PM by Star Trinethram



