IRCTC: భారతీయ రైల్వేల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ కీలక హెచ్చరిక జారీ చేసింది. రైళ్లలో ఆహారాన్ని ఆర్డర్ చేసే సమయంలో అధికారిక ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించాలని సూచించింది. రైల్వే అనుమతి లేకుండా ప్రయాణికులకు ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్న 14 అనధికార వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లపై కఠిన చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా ఫిర్యాదులు చేసినట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యత, వ్యక్తిగత సమాచారం రక్షణ దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
రైళ్లలో ఫుడ్ డెలివరీకి పెరిగిన డిమాండ్..
ఇటీవలి కాలంలో రైలు ప్రయాణ సమయంలో మొబైల్ యాప్‌ల ద్వారా ఆహారం ఆర్డర్ చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రయాణికులు తమ పీఎన్‌ఆర్ వివరాలతో ఆర్డర్ చేస్తే, తదుపరి స్టేషన్‌లో ఆహారం అందించే విధానం విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని అనేక సంస్థలు రైల్వే అనుమతి లేకుండానే ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించాయి. అయితే రైల్వే ప్రయాణికులకు ఎలాంటి సేవలు అందించాలన్నా సంబంధిత అనుమతులు తప్పనిసరి అని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది.
ఎందుకు చర్యలు తీసుకుంది..?
అనధికార ఫుడ్ డెలివరీ సంస్థలు రైల్వే ప్రమాణాలను పాటించకుండా సేవలు అందిస్తున్నాయని ఐఆర్‌సీటీసీ పేర్కొంది. దీంతో నాసిరకం ఆహారం, పరిశుభ్రత లోపాలు, ఆన్‌లైన్ చెల్లింపుల సమస్యలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగం వంటి ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రయాణికుల పీఎన్‌ఆర్ నంబర్లు, మొబైల్ నంబర్లు, ఈమెయిల్ వివరాలు, చెల్లింపు సమాచారం వంటి సున్నితమైన వివరాలు సైబర్ మోసగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని కూడా తెలిపింది.
చర్యలు ఎదుర్కొంటున్న 14 యాప్‌లు, వెబ్‌సైట్లు
ఐఆర్‌సీటీసీ చర్యలు ప్రారంభించిన అనధికార ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల జాబితాలో:
RailRestro
RailMitra
TravelKhana
TrainsCafe
DibRail
RailFood
ComeSum
TravelerFood
FoodOnTrack.in
eCatering App
KhanaOnline
TrainWay
RailMeal
TrainMenu
ఈ సంస్థలపై ఇప్పటికే న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.
ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ సూచన..
రైళ్లలో ఆహారం ఆర్డర్ చేసేటప్పుడు అధికారిక ఐఆర్‌సీటీసీ ఈ-క్యాటరింగ్ సేవలు లేదా అధికారిక ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్‌ను మాత్రమే ఉపయోగించాలని ప్రయాణికులకు సూచించింది. అనధికార యాప్‌ల ద్వారా ఆర్డర్ చేస్తే ఆహార నాణ్యతకు హామీ ఉండదని, వ్యక్తిగత సమాచారం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
రైల్వేల్లో ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి..
ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఐఆర్‌సీటీసీ ఇటీవల దేశవ్యాప్తంగా 800కు పైగా రైల్వే వంటశాలల్లో ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను కూడా అమలు చేసింది. పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా అనే అంశాలను ప్రత్యేక కెమెరాల ద్వారా నిరంతరం పరిశీలిస్తోంది.
ALSO READ: Text Claw: స్మార్ట్ ఫోన్ వాడకంతో ప్రమాదంలో చేతులు..?
Last Updated on June 11, 2026 · 1:17 PM by DHEEKONDA SHIVAKRISHNA



