పాలిథిన్ కవర్లలో అమ్మే ఉప్పు, పంచదారతో పాటు మార్కెట్లో లభించే మంచినీటి బాటిళ్లలో కూడా సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు ఉన్నాయన్న విషయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ అంశాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వయంగా మద్రాస్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. భవిష్యత్ తరాల ఆరోగ్యంపై ఈ మైక్రోప్లాస్టిక్‌లు తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని న్యాయస్థానం కూడా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, పాలిథిన్ ప్యాకెట్లలోని ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిపై ప్రజలను హెచ్చరించేలా స్పష్టమైన లేబుళ్లు తప్పనిసరిగా ముద్రించాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ వ్యవహారానికి కారణమైన పరిశోధన మరింత షాకింగ్‌గా మారింది. కోయంబత్తూరులోని పీఎస్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్ నిర్వహించిన అధ్యయనంలో తల్లి బొడ్డుతాడులోనే మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తేలింది. ఈ నివేదికను హైకోర్టు న్యాయమూర్తులు సుమోటోగా స్వీకరించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ పిటిషనర్లుగా చేర్చారు. తల్లి శరీరంలోకి ప్రవేశించిన ప్లాస్టిక్ కణాలు నేరుగా గర్భస్థ శిశువుకు చేరుతున్నాయంటే అది అత్యంత ప్రమాదకర సంకేతమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణానికి మాత్రమే కాదు, మనిషి జీవన మూలాలకే ఇది ముప్పుగా మారుతోందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
ఈ అధ్యయనంలో ప్రధానంగా గుర్తించిన రసాయనం బిస్ఫెనాల్-ఏ (బీపీఏ). ఇది ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో విస్తృతంగా వాడే రసాయనం. హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసే లక్షణాలు ఉన్న ఈ బీపీఏ, గర్భిణుల బొడ్డుతాడులో నిర్ణీత స్థాయిని మించి ఉన్నట్లు పరిశోధన వెల్లడించింది. కిలోగ్రాము శరీర బరువుకు 0.43 మైక్రోగ్రాముల నుంచి 1.1578 మైక్రోగ్రాముల వరకు బీపీఏ ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చితే చాలా ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల భవిష్యత్‌లో పిల్లల్లో ఊబకాయం, మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. ఈ పరిశోధనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఐఐటీ మద్రాస్‌ను కోరినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ద్వారా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తరపున భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ (FSSAI) కూడా నివేదికను సమర్పించింది. ప్లాస్టిక్ సీసాలు, పాలిథిన్ సంచుల్లోని మైక్రోప్లాస్టిక్‌ల ఉనికిపై దేశవ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపింది.
ప్రాథమిక నివేదికల్లో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయోడైజ్డ్ ఉప్పు, నల్ల ఉప్పు, రాతి ఉప్పులో మైక్రోప్లాస్టిక్ కణాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని తాగునీటి బాటిళ్లలో కూడా మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీనిపై ఇప్పటికే సంయుక్త సమావేశాలు నిర్వహించినట్లు FSSAI ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో మంచినీటి బాటిళ్లపై హెచ్చరిక లేబుళ్లు తప్పనిసరిగా ఉండాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వైద్య నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. మైక్రోప్లాస్టిక్‌ల ప్రభావం మనం ఊహించినదానికంటే చాలా లోతైనది. గర్భస్థ శిశువు దశలోనే శరీర కణాల ప్రవర్తన మారిపోతే, భవిష్యత్తులో తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దీనిని వైద్య శాస్త్రంలో ‘డెవలప్మెంటల్ ఆరిజిన్ ఆఫ్ హెల్త్ అండ్ డిసీజ్’గా పేర్కొంటారు. అంటే గర్భంలో ఉన్నప్పుడే ఆరోగ్య భవిష్యత్తు నిర్ణయమవుతుందన్న మాట.
ప్లాస్టిక్ బాటిళ్లు, పాలిథిన్ సంచుల్లో వేడి టీ, సాంబార్ వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయని వైద్యులు చెబుతున్నారు. పేపర్ కప్పులు, టీ బ్యాగుల్లో కూడా మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయన్న విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందుకే ప్రజలు ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని, సాధ్యమైనంతవరకు ఇనుప పాత్రలు, గాజు బాటిళ్లు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ కేసును సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని భావించిన మద్రాస్ హైకోర్టు, తదుపరి విచారణకు కేసును వాయిదా వేసింది. అయితే, ఈలోగా కేంద్రం, రాష్ట్రాలు తీసుకునే చర్యలే భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని నిర్ణయించనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: ఇదేం పక్షిరా బాబు?.. పామును పొడిచి పొడిచి చంపింది (VIDEO)
Last Updated on February 9, 2026 · 10:49 PM by Star Trinethram



