Jayamalini: ఒకప్పుడు దక్షిణ భారత చిత్రసీమలో తన అందం, నృత్యంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నటి ‘జయమాలిని’ మరోసారి వార్తల్లో నిలిచారు. 1970, 80 దశకాల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆమె, కేవలం నర్తకిగానే కాకుండా వ్యాంప్ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా జగన్మోహిని వంటి సినిమాలతో సోలో హీరోయిన్‌గా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన, భావోద్వేగభరితమైన విషయాలను పంచుకోవడంతో మరోసారి చర్చనీయాంశంగా మారారు.
తన యువక్యంలో తాను ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నప్పటికీ, తన వ్యక్తిగత భావాలను ఎప్పుడూ బయటపెట్టలేదని జయమాలిని వెల్లడించారు. తనను ఇష్టపడినవారు పెళ్లైన వారు, పెళ్లి కాని వారు ఇలా చాలామంది ఉన్నారని, తానూ కొందరిని ఇష్టపడినా కుటుంబ పరువు కోసం ఆ భావాలను మనసులోనే దాచుకున్నానని చెప్పారు. కుటుంబమే తనకు ముఖ్యమని భావించి, తాను తీసుకున్న నిర్ణయాల వల్ల ఇంట్లో ఉన్న సోదరులు, సోదరీమణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని జాగ్రత్త పడ్డానని ఆమె వివరించారు. చిన్న వయసులో కలిగే ఆకర్షణలను సహజమైనవిగా భావించినప్పటికీ, వాటిని నియంత్రించుకోవడమే జీవితంలో తనకు మార్గదర్శకమైందని తెలిపారు.
తరువాత కొంత వయసు వచ్చిన తర్వాత మాత్రం ఒకరిని నిజంగా ఇష్టపడ్డానని, కానీ ఆ విషయాన్ని ఇప్పటికీ ఆ వ్యక్తికి చెప్పలేదని జయమాలిని చెప్పారు. కానీ, చనిపోయే లోపు తప్పకుండా తనను ఇష్టపడ్డానని చెబుతానని వెల్లడించారు. ఇదే సమయంలో మలయాళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడైన జయన్ తనను వివాహం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించారని కూడా ఆమె గుర్తుచేశారు. తనకంటే 22 సంవత్సరాలు పెద్దవాడైన జయన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి పెళ్లి ప్రతిపాదన కూడా తీసుకువచ్చారని, అయితే తనకు ఆయనపై అలాంటి భావాలు లేవని స్పష్టంగా చెప్పారు.
ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఆమె మనసులో చోటు సంపాదించిన ఆ వ్యక్తి ఎవరు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ భాషలలో ఏదో ఒక పరిశ్రమకు చెందిన వ్యక్తి అని ఆమె ఇచ్చిన సంకేతం ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠను మరింత పెంచుతోంది. ఒకప్పుడు తెరపై తన అందం, నృత్యంతో ప్రేక్షకులను కట్టిపడేసిన జయమాలిని, ఇప్పుడు తన జీవితంలోని చెప్పని కథలతో మరోసారి వార్తల్లో నిలవడం విశేషం.
ALSO READ: IPL: కాయ్ రాజా కాయ్!.. కోటిశ్వరులను సైతం రోడ్డున పడేసే బెట్టింగ్ భూతం యాప్స్!
Last Updated on March 28, 2026 · 11:44 PM by Star Trinethram



