Ugadi 2026: తెలుగు ప్రజల సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగలలో ఉగాది ఒకటి. కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు, కొత్త ప్రారంభాలకు ప్రతీకగా భావించే ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందాన్ని నింపుతుంది. ప్రతి సంవత్సరం చైత్ర మాస శుక్లపక్ష పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగతో కొత్త తెలుగు సంవత్సరానికి నాంది పలుకుతారు. ఈ ఏడాది వచ్చే తెలుగు సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం కాగా, ఉగాది పండుగ మార్చి 19న జరగనుంది. ఈ రోజు అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం వంటి ఆచారాలు. అయితే ఈ పండుగ వెనుక ఉన్న పురాణ కథ, విశిష్టత, ఆచారాల వెనుక ఉన్న అర్థం ఎంతో గొప్పదిగా ఉంటుంది.
ఉగాది పండుగ ఆవిర్భావం వెనుక ఉన్న పురాణ కథ..
పురాణాల ప్రకారం.. సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నిద్రలో ఉన్న సమయంలో వేదాలను అపహరించాడు. దీంతో సృష్టి క్రమం లోపించింది. అప్పుడు శ్రీహరి మత్స్యావతారం ఎత్తి సముద్రంలోకి వెళ్లి సోమకుడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మకు అప్పగించాడు. ఈ ఘటన అనంతరం సృష్టి తిరిగి ప్రారంభమైందని చెబుతారు. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని విశ్వసిస్తారు. అదే కాలగణనకు ఆరంభంగా భావించబడింది. యుగానికి ఆది అయిన రోజు యుగాది, కాలక్రమేణా ఉగాది అనే పేరుతో ప్రజల్లో విస్తరించింది.
ఋతువుల మార్పుతో వచ్చే ప్రకృతి అందాలు..
ఉగాది పండుగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు.. ప్రకృతి మార్పును సూచించే ఒక ప్రత్యేక సందర్భం కూడా. శిశిర ఋతువు ముగిసి వసంత ఋతువు ప్రారంభమయ్యే ఈ సమయంలో ప్రకృతి కొత్త కాంతిని సంతరించుకుంటుంది. చెట్లు కొత్త చిగుళ్లు తొడుగుతాయి, పూలు పూస్తాయి, పక్షుల కిలకిలారావాలతో వాతావరణం హుషారుగా మారుతుంది. ప్రకృతి అంతా పచ్చదనంతో కళకళలాడుతుంది. ఋతువుల మార్పు సమయంలో శరీరానికి రోగ నిరోధక శక్తి అవసరం ఉండటంతో, ఈ సందర్భంలోనే షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తీసుకోవడం ఆరోగ్యపరంగానూ ఎంతో ఉపయోగకరమని పెద్దలు చెబుతారు.
ఉగాది రోజు ఇంటింటా జరిగే ఆచారాలు..
ఉగాది రోజున తెల్లవారుజామునే లేచి తలకు నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేయడం సంప్రదాయం. అనంతరం కొత్త బట్టలు ధరించి, ఇంటి గుమ్మాలకు పచ్చని మామిడి ఆకుల తోరణాలు కడతారు. వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి ఇల్లంతా పండుగ వాతావరణాన్ని సృష్టిస్తారు. తరువాత ఇష్టదైవాన్ని ప్రార్థించి పూజలు నిర్వహిస్తారు. పూజ అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. అలాగే సాయంత్రం సమయంలో పంచాంగ శ్రవణం నిర్వహించడం ద్వారా ఆ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను తెలుసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత, జీవన సందేశం..
ఉగాది పండుగలో అత్యంత ముఖ్యమైన అంశం ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలోని వివిధ అనుభవాలను సూచిస్తాయి. బెల్లం తీపి ఆనందానికి సంకేతం కాగా, వేపపువ్వు చేదు బాధలను గుర్తు చేస్తుంది. చింతపండు పులుపు అనుభవాల వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. ఉప్పు జీవితంలో ఉత్సాహాన్ని సూచిస్తే, కారం కోపం, ఆవేశాన్ని ప్రతిబింబిస్తుంది. మామిడి వగరు కొత్త సవాళ్లు, ఆశ్చర్యకర మార్పులను సూచిస్తుంది. ఈ విధంగా షడ్రుచులతో కూడిన ఈ పచ్చడి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరించాలని తెలియజేసే గొప్ప సందేశాన్ని అందిస్తుంది. అందుకే ఉగాది రోజున ఈ పచ్చడిని తప్పనిసరిగా తీసుకోవాలని పెద్దలు సూచిస్తారు.
ఉగాది పండుగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు.. అది మన జీవన విధానాన్ని, మనసును, భావాలను సమతుల్యం చేసే ఒక గొప్ప సాంస్కృతిక సంప్రదాయం. పాత చేదు జ్ఞాపకాలను వదిలిపెట్టి కొత్త ఆశలతో ముందుకు సాగాలని చెప్పే ఈ పండుగ ప్రతి ఒక్కరికీ ఒక కొత్త ప్రారంభానికి ప్రేరణగా నిలుస్తుంది.
ALSO READ: Gurugram: దేశంలోనే తొలి ‘LPG గ్యాస్ ATM’
Last Updated on March 18, 2026 · 5:38 PM by Star Trinethram



