🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 26 April 2026, 1:20 pm Posted by : STAR TRINETHRAM

IPL 2026: ధోనీ ఆడకపోవడానికి గాయం కారణం కాదా.. అసలు నిజం ఇదే..?

News Image
IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ పుంజుకుని విజయపథంలో దూసుకెళ్తున్నప్పటికీ, మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో కనిపించకపోవడం అభిమానుల్లో ఆందోళన, ఆసక్తి రెండింటినీ పెంచుతోంది. సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా మిస్టర్ కూల్ ఒక్క మ్యాచ్‌లోనూ బరిలోకి దిగకపోవడంతో గాయం కారణంగానే అతడు దూరంగా ఉన్నాడని అందరూ భావించారు. అయితే ధోనీ ఆడకపోవడానికి అసలు కారణం వేరే ఉందన్న వార్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గాయం ఒక్కటే కారణం కాదని, జట్టు ప్రయోజనాల కోసమే ధోనీ తన రీఎంట్రీని ఆలస్యం చేస్తున్నాడని తాజా సమాచారం చెబుతోంది. జట్టులో ప్రస్తుతం ఏర్పడిన విన్నింగ్ కాంబినేషన్‌ను చెడగొట్టకూడదనే ఉద్దేశంతోనే ధోనీ స్వయంగా వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. వరుసగా 3 ఓటముల తర్వాత చెన్నై జట్టు పుంజుకుని విజయాల బాట పట్టడంతో, అదే కాంబినేషన్ కొనసాగాలని ధోనీ భావిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

తాజాగా వెలుగులోకి వచ్చిన 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' నివేదికల ప్రకారం ధోనీ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని తెలుస్తోంది. జట్టు విజయవంతంగా ఆడుతున్న సమయంలో తన రాకతో సమీకరణాలు మారకూడదని, జట్టు రిథమ్‌కు భంగం కలగకూడదని ధోనీ భావిస్తున్నాడని సమాచారం. ఇదే సమయంలో ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యాఖ్యలు మరో చర్చకు దారి తీశాయి. ధోనీ కోలుకుంటున్నాడని, వైద్య బృందం సూచనల ప్రకారం సాధన కొనసాగిస్తున్నాడని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ టైటాన్స్‌తో కీలక మ్యాచ్‌కు ముందు చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ధోనీ ఇప్పటికే జట్టుతో ప్రయాణిస్తూ, నెట్స్‌లో క్రమం తప్పకుండా సాధన చేస్తున్నప్పటికీ, తుది జట్టులో మాత్రం చోటు దక్కకపోవడం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉందన్న సంకేతాలు బలపడుతున్నాయి. అభిమానులు గాయం కారణమా లేక వ్యూహాత్మక నిర్ణయమా అన్న చర్చలో ఉండగానే, ఈ పరిణామం మరింత ఆసక్తి రేపుతోంది.

ఇక ధోనీ లేని లోటును కొత్తగా జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ అద్భుతంగా భర్తీ చేస్తున్నాడు. వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుస్తున్న అతడు ముంబై ఇండియన్స్‌పై కేవలం 54 బంతుల్లో 101 పరుగులతో అజేయ సెంచరీ సాధించి జట్టుకు ఘన విజయం అందించాడు. సంజూ అద్భుత ఫామ్‌లో ఉండటం కూడా ధోనీ విశ్రాంతి కొనసాగడానికి మరో కారణంగా భావిస్తున్నారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచినా, ఇటీవల జట్టు ఆటతీరు అభిమానుల్లో నమ్మకం పెంచుతోంది. ముఖ్యంగా ముంబైని వారి సొంత మైదానంలో 103 పరుగుల తేడాతో ఓడించడం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో జట్టు మళ్లీ గాడిలో పడగా, ప్లే ఆఫ్స్ సమయానికి ధోనీ నేరుగా బరిలోకి దిగే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. కోట్లాది మంది అభిమానులు ఇప్పుడు ధోనీ రీఎంట్రీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ALSO READ: Uttar Pradesh: ముఖానికి కేక్ పుశారని ఇంత ఘోరమా..?
🏠 Home