🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 19 April 2026, 10:17 pm Posted by : STAR TRINETHRAM

Kavitha: కొత్త పార్టీ గుబులు.. తెలంగాణ జాగృతిలోకి మాజీ ఎమ్మెల్యేల క్యూ..?

News Image
Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజలకు సేవ చేయడంలో అడ్డంకిగా మారిన పాత రాజకీయ శక్తులను పక్కనబెట్టి, కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరడం ఈ దిశగా కీలక పరిణామంగా నిలిచింది. కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన కవిత, తెలంగాణ సాధన కోసం కలిసి పోరాడిన నాయకులు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కటిగా నిలవాలని పునరుద్ఘాటించారు.



తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకున్న కవిత, 2007లో తన కుటుంబంతో కలిసి బోథ్ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో గిరిజన ప్రాంతాలు మన్నెం జ్వరంతో బాధపడుతూ, కనీస సదుపాయాల లేమితో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే సంకల్పంతో అందరం ఐక్యంగా ఉద్యమించామని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పని చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

రాథోడ్ బాపూరావు గతంలో జాగృతి నుంచి బీఆర్ఎస్‌లో చేరి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ప్రస్తుతం కొత్తగా ఏర్పడబోయే రాజకీయ వేదికలో చేరడం ద్వారా మరోసారి ప్రజాసేవకు కట్టుబడుతున్నారని కవిత తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు ఈ కొత్త రాజకీయ ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారని, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు ఈ దిశగా ఎదురుచూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ కొత్త రాజకీయ శక్తికి మంచి ఆదరణ లభిస్తుందని కూడా ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ.. కవిత నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, రాష్ట్రానికి ఆమె ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. తన రాజకీయ ప్రయాణంలో కవిత ఇచ్చిన ప్రోత్సాహం కీలకమైందని, ఆ ధైర్యంతోనే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించినప్పటికీ, తర్వాత సరైన అవకాశాలు దక్కలేదని, ఇతర పార్టీల్లోనూ తగిన ప్రాధాన్యత లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో ఇచ్చోడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన అనుచరులు, కార్యకర్తలను జాగృతిలో చేర్పించనున్నట్లు వెల్లడించారు.

ఇక ఆదివాసీల హక్కుల అంశంపై కూడా కవిత గళమెత్తారు. జనగణనలో ఆదివాసీల మతానికి ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్టిట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో ఆమెను కలిశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వారు వివరించారు. పెసా చట్టం అమలులో లోపాలు ఉన్నాయని, రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లలో ఉన్న రక్షణలను బలహీనపరుస్తున్నారని కవిత విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టు కారణంగా సుమారు 3 లక్షల ఆదివాసీలు అడవుల నుంచి దూరమవుతున్నారని, వారికి తగిన పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. జనగణనలో మతం కేటగిరిలో ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు లేకపోవడం వారి సంస్కృతిని అవమానించే చర్యగా ఆమె అభివర్ణించారు. ఆదివాసీలు తమ మతాన్ని గర్వంగా ప్రకటించుకునేలా ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

అలాగే ఆదివాసీల భాష ‘కోయతూర్’ను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని కవిత కోరారు. దేశవ్యాప్తంగా సుమారు 12 కోట్ల ఆదివాసీలు భారతీయ సంస్కృతికి ప్రతినిధులని, వారి గౌరవాన్ని కాపాడే లక్ష్యంతో కొత్త రాజకీయ పార్టీ పని చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ, మాడవి నర్సింగరావు, వట్టం నారాయణ దొర, రమణాల లక్ష్మయ్య, వజ్జ నర్సింహరావు, కబ్బాక శ్రావణ్ కుమార్, కుర్సంగ వేణు, వరియ శ్రీనివాస్, షడమాకి సంజీవ్, ఆత్రం పైకాజీ, పోదెం భార్గవ, ఎల్. రూప్ సింగ్, లోకిని రాజు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: Suicide: 30 ఏళ్లు వచ్చినా ఇక 3 ముళ్లు వేసే యోగ్యం లేదేమోనని..
🏠 Home