🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 08 May 2026, 8:36 am Posted by : STAR TRINETHRAM

Telangana: భూముల మార్కెట్ విలువల పెంపుకు ప్రభుత్వం సన్నాహాలు

News Image
Telangana: తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తున్న ధరలు, వాస్తవ మార్కెట్ ధరల మధ్య భారీ అంతరం ఉండటంతో కొత్త విలువలను ఖరారు చేసే దిశగా అధికారులు వేగంగా అధ్యయనం చేస్తున్నారు. జిల్లాల వారీగా భూముల కొనుగోలు విక్రయాల వివరాలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు, నిర్మాణ రంగ అభివృద్ధి, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తూ ప్రాంతాలవారీగా కొత్త రేట్లపై నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ నగరం, ఓఆర్‌ఆర్ పరిధి, వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లో భారీ పెంపు ఉండే అవకాశాలపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ప్రాథమిక అంచనాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను 25 శాతం వరకు పెంచే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో 75 శాతం వరకు పెంపు ఉండొచ్చని సమాచారం వెలువడుతోంది. మార్కెట్ ధరలతో పోలిస్తే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలు చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏకంగా 100 శాతం వరకు పెంపు అమలు చేసే అవకాశాలపై కూడా అధికారులు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్ ఓఆర్‌ఆర్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా విస్తరించింది. భూముల ధరలు భారీగా పెరిగినా, రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రం పాత ధరలే కొనసాగుతున్నాయని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా నిర్మాణ రంగం వేగంగా విస్తరించిన ప్రాంతాల్లో మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య భారీ వ్యత్యాసం ఉందని నివేదికల్లో వెల్లడైంది.

ప్రస్తుతం కోర్ అర్బన్ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ శాఖ ప్రకారం చదరపు అడుగు సగటు విలువ రూ.3500గా ఉంది. దీనిపై 75 శాతం పెంపు అమలు చేస్తే కొత్త విలువ రూ.6125 వరకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రూ.1800గా ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ ధరలను దృష్టిలో పెట్టుకుని రెండింతల వరకు పెంపు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ పెంపు అమలైతే నగర ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ వ్యయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.

కొండాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ అభివృద్ధి కేంద్రాలుగా మారిన ప్రాంతాల్లో కూడా భారీ ప్రభావం కనిపించే అవకాశముంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖ లెక్కల ప్రకారం ఈ ప్రాంతాల్లో గజం ధర సగటున రూ.26,700గా ఉంది. 75 శాతం పెంపు అమలైతే గజం ధర రూ.46,725కు చేరే అవకాశం ఉండగా, 25 శాతం పెరిగినా రూ.33,375 దాటే పరిస్థితి ఉంటుంది. ఐటీ సంస్థలు, భారీ నివాస సముదాయాలు, వాణిజ్య ప్రాజెక్టులు పెరగడంతో ఈ ప్రాంతాల్లో మార్కెట్ విలువలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

నార్సింగ్ ప్రాంతంలో కూడా రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం అక్కడ గజం విలువ రూ.23,800గా ఉండగా, 75 శాతం పెంపు అమలైతే అది రూ.41,650 వరకు చేరే అవకాశముందని అంచనా. హైరైజ్ భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు, విలాసవంతమైన నివాస ప్రాజెక్టులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో మార్కెట్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలను కూడా మార్కెట్ స్థాయికి తీసుకురావాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చే మొత్తం ఆదాయంలో సుమారు 65 శాతం వరకు ఫ్లాట్ల కొనుగోళ్ల ద్వారానే వస్తోందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య విలువైన ఫ్లాట్ల కొనుగోళ్లు నగరంలో భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఫ్లాట్ల మార్కెట్ విలువలను పెంచితే ప్రభుత్వ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే ఈ భారీ పెంపును ఒక్కసారిగా అమలు చేయకుండా విడతల వారీగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ సూచనల మేరకు 3 విడతల్లో ధరల పెంపును అమలు చేసే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు ప్రజలపై ఒక్కసారిగా భారీ భారం పడకుండా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

అదేవిధంగా ప్రతి 4 సంవత్సరాలకు ఒకేసారి భారీగా ధరలు పెంచడం కంటే ప్రతి ఏడాది స్వల్పంగా పెంపు చేసే విధానాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర తరహాలో ప్రతి ఏడాది కనీసం 2 శాతం పెంపు అమలు చేసే అవకాశాలపై చర్చ సాగుతోంది. దీని ద్వారా మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను క్రమంగా సవరించవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Crorepati Habits: కోటీశ్వరులు కావాలంటే అదృష్టం కాదు.. ఈ అలవాట్లు కావాలి
🏠 Home