🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 19 February 2026, 11:19 am Posted by : STAR TRINETHRAM

Gold Ring: 2 గ్రాముల బంగారంతో ఉంగరం చేయించుకోవాలంటే ఎంత ఖర్చవుతుందంటే?

News Image
Gold Ring: బంగారం ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతూ ఉండటంతో ఆభరణాల కొనుగోలు విషయంలో వినియోగదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెద్ద పెద్ద దుకాణాల్లో రెడీమేడ్ నగలు కొనుగోలు చేయడం కంటే తాము ఇష్టపడిన నమూనాతో తక్కువ బరువులో తయారు చేయించుకోవడానికే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా చిన్న ఆభరణాలైన ఉంగరాలు, చెవిపోగులు, మంగళసూత్రాల వంటి వాటిపై డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 2 గ్రాముల బంగారంతో ఉంగరం చేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందన్న ప్రశ్న చాలామందిలో ఉత్కంఠ కలిగిస్తోంది.

బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, విదేశీ మారకపు విలువలు, దేశీయ డిమాండ్, దిగుమతి సుంకాలు వంటి అనేక అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయి. ఇటీవల ధరలు భారీగా పెరగడంతో చిన్న బరువు ఆభరణం కూడా పెద్ద మొత్తంగా మారింది. అందుకే 1 గ్రాముతో సరిపెట్టాలా, లేక 2 గ్రాములు తీసుకోవాలా అన్న సందేహం వినిపిస్తోంది. 1 గ్రాముతో తయారయ్యే ఉంగరం చాలా పలుచగా ఉండే అవకాశం ఉంది. రోజువారీ వినియోగంలో వంగిపోవడం లేదా ఆకారం మారిపోవడం సాధ్యమే. అందువల్ల దీర్ఘకాలం ఉపయోగించాలనుకునే వారు 2 గ్రాముల బరువును ఎంచుకోవడం సమంజసం.

2 గ్రాముల ఉంగరం కొంచెం మందంగా ఉండి మన్నికగా ఉంటుంది. చిన్న నమూనాలు, పేర్లు చెక్కించడం, సాధారణ ఆకృతులు జోడించడం కూడా సులభం. ఇప్పుడు ఖర్చు లెక్కలను పరిశీలిస్తే.. ఉదాహరణకు 22 క్యారట్ బంగారం ధర గ్రాముకు రూ.14,500గా ఉన్నట్లు భావిస్తే 2 గ్రాములకు రూ.29,000 అవుతుంది. ఇది కేవలం బంగారం మూలధర మాత్రమే. దీనికి తయారీ రుసుము అదనంగా చెల్లించాలి. సాధారణంగా 10 నుంచి 20 శాతం వరకు వసూలు చేస్తారు. 15 శాతం పరిగణనలోకి తీసుకుంటే రూ.29,000పై సుమారు రూ.4,350 జతకడుతుంది. దీంతో మొత్తం రూ.33,350కు చేరుతుంది.

ఇదే మొత్తంపై 3 శాతం పన్ను విధిస్తారు. రూ.33,350పై 3 శాతం దాదాపు రూ.1,000 వరకు అవుతుంది. అదనంగా హాల్‌మార్క్ ముద్ర కోసం సుమారు రూ.45 నుంచి రూ.50 వరకు వసూలు చేయబడుతుంది. ఇవన్నీ కలిపి చూసినట్లయితే మొత్తం ఖర్చు సుమారు రూ.34,395 వరకు చేరుతుంది. అంచనా ప్రకారం రూ.34,500 నుంచి రూ.35,000 వరకు బడ్జెట్ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది సాధారణ నమూనా ఉంగరానికి మాత్రమే వర్తిస్తుంది.

నాజూకైన నమూనాలు, చెక్కిన అక్షరాలు, సంప్రదాయ ఆకృతులు, రాళ్ల అమరిక వంటి అంశాలు జోడిస్తే తయారీ రుసుము మరింత పెరగవచ్చు. కొన్ని సందర్భాల్లో అది 18 శాతం లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు. రాళ్ల ధర వేరుగా లెక్కించబడుతుంది. అందువల్ల ముందుగానే నమూనా ఎంపిక చేసుకుని మొత్తం వ్యయాన్ని స్పష్టంగా తెలుసుకోవడం మంచిది. కొంతమంది వ్యాపారులు ప్రత్యేక ఆఫర్ల పేరుతో తయారీ రుసుము తగ్గింపులు ప్రకటించినా.. బంగారం మూలధరలో మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు మార్కెట్ ధరను తెలుసుకుని బిల్లులో గ్రాము ధర, బరువు, తయారీ రుసుము, పన్ను వివరాలు వేరువేరుగా ఉన్నాయో లేదో పరిశీలించడం అవసరం.

2 గ్రాముల ఉంగరం కేవలం అలంకారానికి మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో ఆర్థిక భద్రతగా కూడా ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో విక్రయించి నగదు పొందే వీలుంది. 1 గ్రాముతో పోలిస్తే 2 గ్రాములు మన్నికగా ఉండటంతో తిరిగి అమ్మినప్పుడు కూడా మెరుగైన విలువ దక్కే అవకాశముంది. అందువల్ల దీర్ఘకాల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చు లెక్కలు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ: Gold Prices: సైలెంట్‌గా షాకిచ్చిన బంగారం, వెండి ధరలు
🏠 Home